Ashwin : ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది టెస్టు సిరీస్‌’గా అశ్విన్‌.. ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ వ‌ర‌ల్డ్ రికార్డు స‌మం.. జ‌హీర్ ఖాన్ రికార్డు బ్రేక్‌..

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది

Ashwin : ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది టెస్టు సిరీస్‌’గా అశ్విన్‌.. ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ వ‌ర‌ల్డ్ రికార్డు స‌మం.. జ‌హీర్ ఖాన్ రికార్డు బ్రేక్‌..

Ashwin equals Muttiah Muralitharan world record

Updated On : October 1, 2024 / 4:26 PM IST

Ravichandran Ashwin : బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భార‌త్ క్లీన్ స్వీప్ చేసింది. భార‌త జ‌ట్టు విజ‌యం సాధించ‌డంలో టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ కీల‌క పాత్ర పోషించాడు. అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో అటు బ్యాట్‌తో, ఇటు బంతితోనూ స‌త్తా చాటడంతో అత‌డు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. రెండు మ్యాచుల్లో 114 ప‌రుగులు చేయ‌డంతో పాటు 11 వికెట్లు తీశాడు.

కాగా.. అశ్విన్ త‌న కెరీర్‌లో 11వ సారి ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ అవార్డుల‌ను గెలుచుకున్నాడు. ఈ క్ర‌మంలో శ్రీలంక దిగ్గ‌జ ఆట‌గాడు ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ రికార్డును స‌మం చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్ర‌లో అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్‌లు గెలుచుకున్న ఆట‌గాళ్ల జాబితాలో ముత్త‌య్య ముర‌ళీ ధ‌ర‌న్‌తో క‌లిసి అశ్విన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో అత్య‌ధిక సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆట‌గాళ్లు..
– ముత్త‌య్య ముర‌ళీ ధ‌ర‌న్ (శ్రీలంక‌) – 11 సార్లు
– ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 11* సార్లు
– జాక్వెస్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) – 9 సార్లు
– సర్ రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్‌) – 8 సార్లు
– ఇమ్రాన్ ఖాన్ (పాకిస్థాన్‌) – 8 సార్లు
– షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 8 సార్లు

Rohit Sharma : బంగ్లాదేశ్ పై సిరీస్ విజ‌యం.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైర‌ల్‌

డ‌బ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో అత్య‌ధిక వికెట్లు..
ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-2025 సైకిల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అశ్విన్ రికార్డుల‌కు ఎక్కాడు. అశ్విన్ 10 మ్యాచ్‌ల్లో 21.18 సగటుతో 53 వికెట్లు తీశాడు. ఈ క్ర‌మంలో అత‌డు ఆస్ట్రేలియా ఆట‌గాడు జోష్ హేజిల్‌వుడ్ (51) ను అధిగమించాడు.

డ‌బ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ప్లేయ‌ర్లు..
* ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 10 మ్యాచుల్లో 53 వికెట్లు
* జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) – 11 మ్యాచుల్లో 51 వికెట్లు
* పాట్ క‌మిన్స్ (ఆస్ట్రేలియా) – 12 మ్యాచుల్లో 48 వికెట్లు
* మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 11 మ్యాచుల్లో 48 వికెట్లు
* క్రిస్ వోక్స్ (ఇంగ్లాండ్‌) – 9 మ్యాచుల్లో 43 వికెట్లు..

WTC Points Table : బంగ్లాదేశ్ పై భార‌త్ సిరీస్ విజ‌యం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక మారిందా?

జ‌హీర్ ఖాన్ రికార్డు బ్రేక్‌..
భార‌త్, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన టెస్టు మ్యాచుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన వీరుడిగా ర‌విచంద్ర‌న్ అశ్విన్ నిలిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు టీమ్ఇండియా మాజీ పేస‌ర్ జ‌హీర్ పేరిట ఉండేది. జ‌హీర్ మొత్తం 31 వికెట్లు తీయ‌గా, అశ్విన్ 34 వికెట్ల‌ను సాధించాడు.