WTC Points Table : బంగ్లాదేశ్ పై భారత్ సిరీస్ విజయం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక మారిందా?
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated World Test Championship Points Table After India Sweep Bangladesh
WTC Points Table : కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025 (డబ్ల్యూటీసీ)లో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈ విజయంతో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.
ప్రస్తుతం భారత్ 74.24 విజయశాతం కలిగి ఉంది. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (62.50 శాతం), శ్రీలంక (55.56 శాతం) లు ఉన్నాయి. ఇక భారత్ చేతిలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ ఏడో స్థానంలో కొనసాగుతోంది.
డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో తాజా టెస్టు మ్యాచ్‌తో కలిపి భారత్ 11 టెస్టులు ఆడింది. 8 మ్యాచుల్లో విజయం సాధించింది. రెండు మ్యాచుల్లో ఓడగా, ఓ మ్యాచ్ డ్రా ముగిసింది. విజయశాతం 74.24 శాతం కాగా భారత్ ఖాతాలో 98 పాయింట్లు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా 12 టెస్టులు ఆడింది. ఇందులో 8 మ్యాచుల్లో గెలవగా, 3 మ్యాచుల్లో ఓడింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆసీస్ విజయశాతం 62.50గా ఉంది. ఆసీస్ ఖాతాలో 90 పాయింట్లు ఉన్నాయి.
ఇక న్యూజిలాండ్ పై సంచలన విజయాలు సాధించిన శ్రీలంక మూడో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటి వరకు లంక 9 మ్యాచులు ఆడగా 5 మ్యాచుల్లో గెలిచింది. మరో నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. లంక విజయశాతం 55.56గా ఉంది. ఈ పట్టికలో వెస్టిండీస్ ఆఖరి స్థానంలో ఉంది. 9 మ్యాచులు ఆడగా ఒక్క మ్యాచులోనే విండీస్ గెలిచింది. ఆరు మ్యాచుల్లో ఓడిపోగా రెండు మ్యాచులను డ్రా చేసుకుంది. 18.52 శాతం కలిగి ఉంది.
మార్చి 2025 నాటికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచులో ఆడనున్నాయి.