Rohit Sharma : బంగ్లాదేశ్ పై సిరీస్ విజయం.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Rohit Sharma comments
Rohit Sharma : కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది భారత్. సొంత గడ్డపై భారత్‌కు ఇది వరుసగా 18వ సిరీస్ విజయం కావడం గమనార్హం. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. సిరీస్ విజయం సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశ్యంలో టెస్టు సిరీస్ గెలవడం పై రోహిత్ శర్మ మాట్లాడాడు. జీవితంలో ఏదో ఒక దశలో వేర్వేరు సిబ్బందితో పని చేయాల్సి ఉంటుంది. రాహుల్ ద్రవిడ్ శకం ముగిసింది. ఆయనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అదో అద్భుతమైన సమయం. జీవితంలో మనమందరం ముందుకు సాగాలి. గౌతమ్ గంభీర్‌తో కలిసి ఆడాను. అతడి మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు. ప్లేయర్లు ఎలా ఆడాలని అనుకుంటున్నారో అలాగే ఆడమని చెబుతాడు. అతడి కోచింగ్ ఇప్పడే ప్రారంభమైంది. అద్భుతమైన ప్రారంభం దక్కింది.. అని రోహిత్ అన్నాడు.
ఇక కాన్పూర్ టెస్టు మ్యాచులో రెండున్నర రోజులు ఆట నష్టపోవడం గురించి మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే ఆటను ముందుకు తీసుకెళ్లేందుకు మేము చాలా ఆలోచించాల్సి వచ్చింది అని రోహిత్ తెలిపాడు. రెండున్న రోజులు నష్టపోయిన తరువాత నాలుగో రోజు మైదానంలో అడుగుపెట్టేటప్పుడు బంగ్లాదేశ్‌ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేయాలని, ఆ తరువాత బ్యాట్‌తో బ్యాట్‌తో భారీ స్కోరు చేయాలని భావించినట్లు చెప్పాడు.
ఇక పిచ్ నుంచి బౌలర్లకు పెద్దగా సహకారం లేదన్నాడు. అయినప్పటికి బౌలర్లు అద్భుతం చేశారన్నాడు. ఇక బ్యాటర్లు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నాడు. వేగంగా ఆడే క్రమంలో ఒక్కొసారి తక్కువ స్కోరుకే 100 నుంచి 150 లోపే ఆలౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. మొత్తంగా గేమ్‌లో ఎలా గెలవాలనే దానిపైనే ఫోకస్ చేసినట్లు చెప్పాడు.
ఆకాష్ దీప్ గురించి మాట్లాడుతూ.. దేశవాళీ క్రికెట్‌లో అతడికి ఎంతో అనుభవం ఉందన్నాడు. అతను సుదీర్ఘ స్పెల్‌లు వేయగలడన్నారు. తన ఓవర్ చాలా త్వరగా పూర్తి చేస్తాడని చెప్పారు. ఇటీవల కాలంలో సుదీర్ఘంగా మ్యాచులు ఆడుతూ ఉన్నాం. బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లు గాయాల బారిన పడే అవకాశం ఉంది. అందుకనే సాధ్యమైనంత ఎక్కువ మంది బౌలర్లకు అవకాశాలు ఇచ్చి బెంచీ బలాన్ని పెంచాలనేది తమ ఐడియా అని రోహిత్ అన్నాడు.