Ashwin : భారత జట్టుకు అతి పెద్ద శత్రువు ఇతనే.. ఎందుకో తెలుసా..?
సెంచూరియన్‌లో తొలి టెస్టుకు ముందు భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ ఓ వ్యక్తిని పరిచయం చేశాడు.

Ashwin Reveals One Of The Biggest Enemies Of Indian Cricket Team
Ravichandran Ashwin : మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం భారత్ సిద్దమవుతోంది. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న భారత్, దక్షిణాఫ్రికా జట్లు మొదటి టెస్టు మ్యాచులో తలపడనున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే సెంచూరియన్ చేరుకుని మ్యాచ్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా.. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారత జట్టు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా ఈ సారి ఎలాగైన టెస్టు సిరీస్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది.
కాగా.. సెంచూరియన్‌లో తొలి టెస్టుకు ముందు భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. ఇతడు భారత జట్టుకు అతి పెద్ద శత్రువు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అశ్విన్ అతడిని ఇలా అడిగాడు. సర్ మిమ్మల్ని ఏమని పరిచయం చేయాలి అని అడుగగా పప్పా వెంకటేశ్ అని అంటే చాలు అంటూ సమాధానం వచ్చింది.
ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో అన్న సంగతిని అశ్విన్ వివరించాడు. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టుకు అతి పెద్ద శత్రువుల్లో ఇతను ఒకడు అని అన్నాడు. ఎందుకంటే గత నెల వరకు ఈయన వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు స్థానిక మేనేజర్‌గా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇలా ఎందుకు చేశారని అశ్విన్ సదరు వ్యక్తిని ప్రశ్నించారు.
అది జరిగే వరకు నా జీవితం ప్రశాంతంగా ఉంది. కానీ అప్పటి నుంచి మనశాంతి పోయినట్లు వెంకటేశ్ చెప్పారు. ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియా మన దేశం మొత్తం తిరిగింది. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏమీ కావాలన్నా మిమ్మల్నే వారు సంప్రదించారు. ఇప్పుడు భారత్-ఏ జట్టుతో ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అని అశ్విన్ అడిగారు.
ఆస్ట్రేలియా జట్టుతో ఉన్నా, భారత్-ఏ జట్టు వెంట ఉన్నప్పటికీ తాను చేసే పనిలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు. అయితే.. భారత జట్టులో తెలిసిన వారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కొంచెం బాగుందని వెంకటేశ్ అన్నారు. ఇక మిమ్మల్నీ లైవ్‌కు పిలవాలా..? వద్దా అని చాలా ఆలోచించాను. పిలిస్తే.. మిమ్మల్ని బలిపశువును చేసినట్లు అవుతుందని భావించాను అని అశ్విన్ అనగా.. నాకు నేనుగా వచ్చి బలిపశువును అయ్యాను అంటూ నవ్వుతూ వెంకటేశ్ బదులు ఇచ్చాడు. ఇతను స్థానిక మేనేజర్. జట్టు కావాల్సిన వాటినన్నింటిని సమకూరుస్తారు అని అశ్విన్ చెప్పాడు.