Asia Cup 2025: ఆసియా కప్ విజేత భారత్.. ఫైనల్స్ లో పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ

తుది పోరు చివరివరకు నరాలు తెగేంత ఉత్కంఠగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఇరు జట్లు తలపడ్డాయి.

Asia Cup 2025: ఆసియా కప్ విజేత భారత్.. ఫైనల్స్ లో పాకిస్తాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. హాఫ్ సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ

Courtesy @ ESPNCricinfo

Updated On : September 29, 2025 / 12:34 AM IST

Asia Cup 2025: ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్ లో పాకిస్తాన్ ను మట్టికరిపించింది భారత్. 5 వికెట్ల తేడాతో విజయదుంధుబి మోగించింది. పాక్ నిర్దేశించిన 147 పరుగుల టార్గెట్ ను భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

ముఖ్యంగా తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఒంటి చేత్తో భారత్ కు విజయాన్ని అందించాడు. 53 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. తన పని తాను చేసుకుంటూ వెళ్లాడు. చివరి వరకు క్రీజులో ఉండి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు.

147 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. ఆరంభంలో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అటువంటి పరిస్థితుల్లో తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ చేశాడు. క్రీజులో నిలదొక్కుకుని జట్టుకి వీర తిలకం దిద్దాడు. మరో ఎండ్ లో దూబే చక్కని సహకారం అందించాడు. దూబే 22 బంతుల్లో 33 పరుగులు చేశాడు. సంజూన్ శాంసన్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 24 పరుగులతో రాణించాడు.

భారత్, పాక్ తుది పోరు చివరివరకు నరాలు తెగేంత ఉత్కంఠగా సాగింది. ఓసారి పాక్ ది పై చేయి అయ్యింది. మరోసారి భారత్ ఆధిపత్యం చూపింది. ఇలా మ్యాచ్ చాలా టెన్షన్ టెన్షన్ గా సాగింది. తుదిపోరులో అద్భుతంగా పోరాడిన తిలక్ వర్మ.. చిరకాల ప్రత్యర్థి పై భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాగా, ఈ టైటిల్ ను భారత్ దక్కించుకోవడం ఇది తొమ్మిదోసారి.

చెలరేగిన భారత స్పిన్నర్లు..

ఫైనల్ మ్యాచ్ లో భారత్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటోంది. తొలుత తడబడినట్లు కనిపించినా.. తర్వాత గాడిలో పడింది. పాకిస్థాన్ 113 పరుగులకు ఒక్క వికెట్ ఉన్న దశ నుంచి 133 రన్స్‌కు 6 వికెట్లు కోల్పోయింది. భారీ స్కోర్ తప్పదేమో అని అంతా భయపడ్డారు. సరిగ్గా అదే సమయంలో మన స్పిన్నర్లు చెలరేగిపోయారు. పాక్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. భారీ స్కోర్ కాకుండా అడ్డుకున్నారు. 113/1 గా పాక్.. భారత స్పిన్నర్లు చెలరేగడంతో 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో విజృంభించాడు. ఒకే ఓవర్ లో 3 వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీశారు.