Asia Cup Trophy: అప్పుడేమో ఆసియా కప్ ట్రోఫీ ఎత్తుకుపోయాడు.. ఇప్పుడు ఇస్తాడట.. కానీ..

Asia Cup Trophy: మొహ్సిన్ నఖ్వి తీరుపై ఆగ్రహంతో ఉన్న బీసీసీఐ మంగళవారం జరిగిన ఏసీసీ ఏజీఎం సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Asia Cup Trophy: అప్పుడేమో ఆసియా కప్ ట్రోఫీ ఎత్తుకుపోయాడు.. ఇప్పుడు ఇస్తాడట.. కానీ..

Asia Cup Trophy

Updated On : October 1, 2025 / 12:02 PM IST

Asia Cup Trophy: ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా.. గత నెలలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టును ఓడించి టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆసియా కప్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ట్రోఫీ అందుకునే విషయంలో దుబాయ్ స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతులు మీదుగా ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా జట్టు నిరాకరించింది. దీంతో ట్రోఫీని, మెడల్స్‌ను ఆయన హోటల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. దీంతో నఖ్వీ తీరుపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మొహ్సిన్ నఖ్వీ తీరుపై భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోఫీని, మెడల్స్ ను అతనితో తీసుకెళ్లే హక్కు ఆయనకు లేదు. ఇది చాలా దురదృష్టకరం. క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలను వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి ఇస్తారని మేము ఆశిస్తున్నాం అని అన్నారు.

Also Read: Tilak Varma : పాక్ ప్లేయర్లు నన్ను రెచ్చగొట్టారు.. నాపట్ల దురుసుగా ప్రవర్తించారు.. కానీ.. : తిలక్ వర్మ కీలక కామెంట్స్

నఖ్వి తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏజీఎం సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సమావేశానికి వర్చువల్ గా హాజరైన బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మొహ్సిన్ నఖ్వికి కఠినమైన ప్రశ్నలు సంధించారు. ట్రోఫీ ఏసీసీ సొత్తు అని, నఖ్వీది కాదంటూ గుర్తు చేశారు. ట్రోఫీని సరైన పద్దతిలో భారత్‌కు అందజేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ఏసీసీ వెంటనే పరిశీలించాలని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై శుక్లా, నఖ్వీ మధ్య వాదనలు జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో భారత జట్టు ట్రోఫీని కోరుకుంటే.. ఆ జట్టు కెప్టెన్ ఏసీసీ కార్యాలయానికి వ్యక్తిగతంగా వచ్చి స్వీకరించాలని మొహ్సిన్ నఖ్వీ సూచించినట్లు తెలిసింది.

క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏజీఎం సమావేశంకు వర్చువల్‌గా హాజరైన బీసీసీఐ అధికారులు మొహ్సిన్ నఖ్వీతీరుపై తీవ్రంగా స్పందించారు. ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రధాన కార్యాలయానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అందుకు స్పందించిన ఏసీసీ చీఫ్ నఖ్వీ.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ కార్యాలయంకు వచ్చి ట్రోఫీని తీసుకోవాలని షరతు పెట్టారు. అయితే, మొహ్సిన్ నఖ్వీ తీరుపై నవంబర్‌లో జరిగే సమావేశంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది.