Asian Games 2023 : మొద‌టి మ్యాచ్‌లోనే చెత్త రికార్డు.. 15 ప‌రుగుల‌కే మంగోలియా ఆలౌట్‌

చైనాలోని హాంగ్‌జౌ న‌గరంలో ఆసియా క్రీడ‌లు సెప్టెంబ‌ర్ 23 శ‌నివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అయితే.. అంత‌కంటే ముందే క్రికెట్, వాలీబాల్, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్‌తో సహా ప‌లు క్రీడలు ప్రారంభం అయ్యాయి.

Asian Games 2023 : మొద‌టి మ్యాచ్‌లోనే చెత్త రికార్డు.. 15 ప‌రుగుల‌కే మంగోలియా ఆలౌట్‌

Mongolia vs Indonesia

Updated On : September 19, 2023 / 7:46 PM IST

Asian Games : చైనాలోని హాంగ్‌జౌ న‌గరంలో ఆసియా క్రీడ‌లు (Asian Games ) సెప్టెంబ‌ర్ 23 శ‌నివారం నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. అయితే.. అంత‌కంటే ముందే క్రికెట్, వాలీబాల్, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్‌తో సహా ప‌లు క్రీడలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మ‌హిళ‌ల క్రికెట్ మ్యాచులు ప్రారంభం అయ్యాయి. ఆరంభ మ్యాచ్‌లో ఇండోనేషియా జ‌ట్టు సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేసింది. మంగోలియా జ‌ట్టును కేవ‌లం 15 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది.

ఈ మ్యాచులో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. ఇందులో ఎక్స్‌ట్రా రూపంలో 49 ప‌రుగులు ఉండ‌డం గ‌మ‌నార్హం. వాటిలో 38 వైడ్‌ల‌ను మంగోలియా బౌల‌ర్లు వేశారు. అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన మంగోలియా 10 ఓవ‌ర్ల‌లో 15 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఏడుగురు ప్లేయ‌ర్లు డ‌కౌట్ అయ్యారు. ఎక్స్‌ట్రా రూపంలో వ‌చ్చిన ఐదు ప‌రుగులే అత్య‌ధిక స్కోరుగా నిలిచింది. మ్యాచ్ ఓడిపోవ‌డంతో మంగోలియా మ‌హిళా క్రికెట‌ర్లు క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

దీనిపై మంగోలియా కోచ్ డేవిడ్ తలల్లా మాట్లాడుతూ.. త‌మ యువ జ‌ట్టు ప‌ట్ల గ‌ర్వంగా ఉన్న‌ట్లు చెప్పాడు. వారి స‌గ‌టు వ‌య‌సు కేవ‌లం 19 సంవ‌త్స‌రాలేన‌ని, క్రికెట్ ఆడేందుకు స‌రిప‌డా వ‌న‌రులు కూడా లేవ‌ని చెప్పాడు. జ‌ట్టులోని ప్లేయ‌ర్ల‌లో స‌గం కంటే ఎక్కువ మంది ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం మంగోలియా విడిచి బ‌య‌ట ఆడ‌లేద‌ని, కృతిమ పిచ్‌ల‌పైనే ఆడిన విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. మొద‌టి సారి వారు గ్రాస్ పిచ్‌ల‌పై ఆడిన‌ట్లు చెప్పారు.

ICC World Cup 2023 : పాకిస్తాన్‌ మ్యాచ్‌.. ఉప్ప‌ల్‌లో ప్రేక్ష‌కుల‌కు నో ఎంట్రీ..!

మంగోలియా మొక్క కిట్‌ను ఆస్ట్రేలియా నుంచి సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేశామ‌ని, వారికున్న నాలుగు బ్యాట‌ర్ల‌ను ఫ్రెంచ్ రాయ‌బారి విరాళంగా ఇచ్చిన‌ట్లు తెలిపారు. ‘మేము 15 పరుగులు మాత్రమే చేసాము అని నాకు తెలుసు. కానీ మా అమ్మాయిల్లో ఎవ‌రూ కూడా రెండు సంవ‌త్స‌రాల‌కు పైగా క్రికెట్ ఆడిన అనుభ‌వం కూడా లేదు. మా బృందంలో 12 మంది మాత్ర‌మే ఉన్నారు.’ అంత‌కు మించి తీసుకురాలేక‌పోయిన‌ట్లు డేవిడ్ తెలిపారు. తాను కూడా గ‌త ఐదు వారాల నుంచే టీమ్‌కు కోచ్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పారు. ఆరు నెల‌ల క్రితం వ‌ర‌కు మంగోలియాలు క్రికెట్ ఆడుతార‌నే విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పాడు.