ICC World Cup 2023 : పాకిస్తాన్ మ్యాచ్.. ఉప్పల్‌లో ప్రేక్షకులకు నో ఎంట్రీ..!
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత దేశంలో వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనుంది. ప్రపంచకప్ కోసం మొత్తం 10 జట్లు పోటీపడనున్నాయి.

Pakistan vs New Zealand
ICC World Cup : అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత దేశంలో వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనుంది. ప్రపంచకప్ కోసం మొత్తం 10 జట్లు పోటీపడనున్నాయి. అయితే.. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు వార్మప్ మ్యాచులు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే విక్రయించారు కూడా. కాగా.. సెప్టెంబర్ 29న న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) నిర్ణయం తీసుకుంది.
ఈ మ్యాచ్‌కు స్థానిక పోలీసులు సెక్యూరిటీని ఇవ్వలేమని చెప్పడమే అందుకు కారణంగా తెలుస్తోంది. మ్యాచ్‌కు ముందు రోజు (సెప్టెంబర్ 28)న గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉండడంతో మ్యాచ్‌కు సెక్యూరిటీ ఇవ్వలేమని ఇప్పటికే హెచ్‌సీఏకు పోలీసులు తెలిపారు. మ్యాచ్‌ను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి హెచ్‌సీఏ తీసుకువెళ్లగా ఇప్పటికే ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఓ సారి మార్చామని మరోసారి అలా చేయలేమని చెప్పింది.
ఈ క్రమంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ను ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని హెచ్‌సీఏ నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో తెలిపింది. ఈ మ్యాచ్ కోసం టికెట్లు కొన్న వారికి నగదును తిరిగి ఇచ్చేయాలని క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం టిక్కెట్ భాగస్వామి అయిన ‘Bookmyshow’ వెబ్‌సైట్‌కి బీసీసీఐ సూచించినట్లు వెల్లడించింది.
10 వార్మప్ మ్యాచులు..
మెగా టోర్నీ ఆరంభానికి ముందు 10 వార్మప్ మ్యాచులు జరగనున్నాయి.
– సెప్టెంబర్ 29న గౌహతి వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, తిరువంతపురంలో అఫ్గానిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, హైదరాబాద్‌లో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తలపడనున్నాయి.
– సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్, తిరువంతపురంలో ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచులు జరగనున్నాయి.
– అక్టోబర్ 2న గౌహతి వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లాండ్, తిరువంతపురంలో న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా లు తలపడతాయి.
– అక్టోబర్ 3న గౌహతి వేదికగా అప్గానిస్తాన్ వర్సెస్ శ్రీలంక, తిరువనంతపురంలో ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్, హైదరాబాద్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ లు పోటీపడతాయి.
ICC World Cup 2023 : సూపర్ స్టార్ రజినీకాంత్‌కు బీసీసీఐ ‘గోల్డెన్ టికెట్’