షమీ ఎందుకు ప్రపంచ స్థాయి ఆటగాడో ఆ రోజు నాకు అర్థమైంది.. రోహిత్ క్యాచ్‌ను నేను వదిలేసినప్పటికీ..: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్
సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ క్యాచ్‌ను కానెల్లీ మిస్ చేశాడు.

ఇటీవలే ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి.. ఆ తర్వాత ఫైనల్లో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. అయితే తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ కూపర్ కానెల్లీ మీడియాతో టీమిండియా-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ గురించి, రోహిత్ శర్మ క్యాచ్‌ను తాను వదలడం గురించి, బౌలర్ షమీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
వెన్నునొప్పి కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2025 చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన నేపథ్యంలో మహ్మద్ షమీ టోర్నమెంట్లో స్థానం దక్కించుకొని ఐదు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు తీశాడు. ఎంతో అనుభవం కలిగిన ఈ బౌలర్ అంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో నమ్మకం.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌లో షమీ మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత్ విజయానికి బాటలు వేశాడు. అలాగే న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో కూడా ఒక వికెట్ తీసి తనవంతు టీమిండియా విజయానికి కృషి చేశాడు. ప్రత్యేకంగా, సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ గా వచ్చిన కూపర్ కానెల్లీ షమీ బౌలింగ్‌కు తట్టుకోలేక వెనుదిరిగాడు.
తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ కూపర్ కానెల్లీ మీడియాతో మాట్లాడుతూ తన ఛాంపియన్స్ ట్రోఫీ అనుభవాన్ని పంచుకున్నాడు. “చిన్నప్పటి నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కోరుకున్నాను. సెమీ ఫైనల్‌లో ఆడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మ్యాచ్ లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను” అని చెప్పాడు.
ఇండియా-ఆస్ట్రేలియా సెమీఫైనల్‌లో షమీ అద్భుతమైన ఔట్‌స్వింగర్‌తో కానెల్లీని వెనక్కి పంపించాడు. “షమీ ఎందుకు ప్రపంచ స్థాయి ఆటగాడో ఆ రోజు నాకు అర్థమైంది. అతను చాలా అనుభవం ఉన్న బౌలర్” అని కానెల్లీ చెప్పాడు.
సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ క్యాచ్‌ను కానెల్లీ వదిలేశాడు. అయితే, ఎనిమిదో ఓవర్లో మాత్రం భారత కెప్టెన్‌ను అవుట్ చేయడంలో సఫలమయ్యాడు. “ఇది క్రికెట్ ఆట. కొన్నిసార్లు అవకాశాలను కోల్పోతాం, క్యాచ్‌లు తప్పుతాం. కానీ దానిపై ఎక్కువగా ఆలోచించకుండా ముందుకెళ్లాలి” అని అన్నాడు.