Babar Azam:చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్.. ఆమ్లా, విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్ రికార్డు బద్దలు
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆమ్లా, విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్ రికార్డులను బద్దలు కొట్టాడు.

Babar Azam becomes fastest player to reach 5000 runs in ODIs
Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్(Babar Azam) చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 5వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో హషీమ్ ఆమ్లా(Hashim Amla), విరాట్ కోహ్లీ(Virat Kohli), వివ్ రిచర్డ్స్(Viv Richards) రికార్డులను బద్దలు కొట్టాడు. కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో అతడు ఈ ఘనత సాధించాడు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ గత రెండేళ్లుగా వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. జూలై 2021 నుంచి ఇప్పటి వరకు 16 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేయగా.. నాలుగు సెంచరీలతో సహా 13 అర్ధశతకాలు చేశాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయగా బాబర్ ఆజామ్ 117 బంతుల్లో 107 పరుగులు చేసి వన్డేల్లో 18వ సెంచరీని నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందుకు బాబర్‌కు 97 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఇంతకముందు వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 101 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ, వివ్ రిచర్డ్స్ ఇద్దరు 114 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను అందుకున్నారు.
4వేల పరుగుల రికార్డు మిస్..
వన్డేల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు చేసిన రికార్డును గత సంవత్సరం బాబర్ ఆజామ్ తృటిలో మిస్ అయ్యాడు. 82 ఇన్నింగ్స్‌ల్లో బాబర్ నాలుగు వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ రికార్డు హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. అతడు 81 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బాబర్ ఆజామ్ సెంచరీ, ఆగా సల్మాన్(58) అర్ధశతకంతో రాణించడంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ఉసామా మీర్ నాలుగు వికెట్లతో కివీస్‌ను దెబ్బకొట్టడంతో ఛేదనలో న్యూజిలాండ్ 43.4 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. దీంతో 5 వన్డేల సిరీస్‌లో పాకిస్థాన్ 4-0 తో ఆధిక్యంలో ఉంది.