సిక్కిరెడ్డి అకౌంట్ హ్యాక్: 50వేలకి అమ్మేస్తానంటూ బెదిరింపులు

సిక్కిరెడ్డి అకౌంట్ హ్యాక్: 50వేలకి అమ్మేస్తానంటూ బెదిరింపులు

Updated On : September 14, 2019 / 2:01 AM IST

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, అర్జున అవార్డు విజేత సిక్కి రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. అంతేకాదు శుక్రవారం తనకు వచ్చిన వాట్సప్ మెసేజ్ చూసి షాక్ అయింది. హ్యాకర్ అకౌంట్ హ్యాక్ చేయడమే కాక తన అకౌంట్‌ను 700బిలియన్ డాలర్లకు అమ్మేస్తానంటూ బెదిరించాడు. 

దీంతో ట్విట్టర్‌లో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని అధికారుల నుంచి సాయం కావాలంటూ కోరింది. ‘ప్లీజ్ సాయం చేయండి. ఎవరో హ్యాకర్ నా అకౌంట్ హ్యాక్ చేసి మెసేజ్‌లు పంపిస్తున్నాడు. రిపోర్ట్ చేసినప్పటికీ ఏ మాత్రం రెస్పాన్స్ లేదు. తను నా మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ అన్నీ దొంగిలించాడు’ అని ట్వీట్ చేసింది. 

హైదరాబాద్ పోలీసులు దీనిపై స్పందించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. సిక్కీ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఇలా ట్వీట్ చేసింది. ‘ప్రతి ఒక్కరికీ.. హాయ్! నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. నాకు మెసేజ్‌లు కానీ, ట్యాగ్ చేయడం కానీ చేయొద్దు. అకౌంట్ తిరిగి వచ్చాక చెప్తా. నాకు తెలిసి టర్కీ నుంచి ఎవరో హ్యాకర్ దీనిని హ్యాక్ చేసినట్లుగా అనుమానంగా ఉంది’ అని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.