IPL 2026 : బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం..
ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిషేదిస్తూ (IPL 2026) బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Bangladesh government has ordered an indefinite ban on the telecast of the Indian Premier League
- ముస్తాఫిజుర్ రెహ్మన్ తొలగింపు
- బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేదం
IPL 2026 : బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై నిషేదం విధించింది. ఈ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ బంగ్లాదేశ్ అధికారులు సోమవారం (జనవరి 5న) ఓ ప్రకటన విడుదల చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఐపీఎల్‌కు సంబంధించిన ప్రసారాలు, కార్యక్రమాలను తక్షణమే నిలిపివేసినట్లు బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ తెలిపింది.
‘ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26న ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను మినహాయించాలని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను తీవ్రంగా బాధించింది, ఆగ్రహానికి గురిచేసింది. ఈ పరిస్థితులలో తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు, దాని సంబంధిత కార్యక్రమాలను బంగ్లాదేశ్‌లో ప్రసారం చేయకుండా నిలిపివేస్తున్నాం.’ అని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ముస్తాఫిజుర్‌ను ఎందుకు రిలీవ్ చేశారు?
గత కొంతకాలంగా భారత్, బంగ్లాదేశ్ ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో బంగ్లా ఆటగాళ్లను నిషేదించాలనే డిమాండ్ల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ ను రిలీవ్ చేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు అతడిని రిలీవ్ చేసింది.
భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడం..
కేకేఆర్ జట్టు ముస్తాఫిజుర్‌ను రిలీవ్ చేయడం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన ఒక రోజు వ్యవధిలోనే భారత్‌లో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆడేందుకు నిరాకరించింది. భద్రతా కారణాలను చూపిస్తూ ఐసీసీకి ఓ లేఖ రాసింది. మెగాటోర్నీలో తాము ఆడే మ్యాచ్‌లను శ్రీలంక వేదికగా నిర్వహించాలని అందులో విజ్ఞప్తి చేసింది.
అంత తేలిక కాదు..!
టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ సిలో ఉంది. ఇప్పటికే ఈ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి 17న ముంబయిలో నేపాల్‌తో తలపడాల్సి ఉంది.
Ambati Rayudu : ముచ్చటగా మూడోసారి తండ్రైన అంబటి రాయుడు.. 40 ఏళ్ల వయసులో
అయితే.. మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని తాజాగా బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. ఈ టోర్నీకి నెలరోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో బంగ్లా మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించడం దాదాపు అసాధ్యమని పలువురు అధికారులు చెబుతున్నారు. మరి దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
