India Womens Team: ఫైనల్లో గెలిస్తే అమ్మాయిలపై కాసుల వర్షమే..! రూ.125 కోట్లు క్యాష్ ప్రైజ్ అందుకోనున్న భారత మహిళల జట్టు..!

రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న జట్టుకు బీసీసీఐ 125 కోట్ల రూపాయల భారీ బోనస్‌ను ప్రకటించింది.

India Womens Team: ఫైనల్లో గెలిస్తే అమ్మాయిలపై కాసుల వర్షమే..! రూ.125 కోట్లు క్యాష్ ప్రైజ్ అందుకోనున్న భారత మహిళల జట్టు..!

Updated On : November 1, 2025 / 7:52 PM IST

India Womens Team: ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ పోరుకి భారత మహిళల జట్టు సిద్ధంగా ఉంది. తుది పోరులో సౌతాఫిక్రాతో తలపడనుంది. ఇందులో గెలిచి వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవడానికి టీమిండియా తహతహలాడుతోంది. ఇదే సమయంలో వారికి మరో గుడ్ న్యూస్. ఫైనల్లో గెలిస్తే ఉమెన్స్ టీమ్ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ గెలుచుకోనుంది. అక్షరాల 125 కోట్ల రూపాయల క్యాష్ అందుకోనుంది.

దక్షిణాఫ్రికాతో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో చరిత్ర సృష్టించాలని భారత మహిళల జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో గెలిస్తే కనుక.. పురుషుల జట్టుకి ఇచ్చే సమానమైన నగదు బహుమతిని మహిళల జట్టుకి ఇవ్వాలని BCCI ప్లాన్ చేస్తోంది.

ఆదివారం జరిగే ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడేందుకు సిద్ధమవుతున్న భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర పుటల్లో నిలవనుంది. మహిళల జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటే.. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టుకు పురుషుల జట్టుకు సమానమైన నగదు బహుమతిని ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ చర్య భారత క్రికెట్‌లో లింగ సమానత్వానికి ఒక మైలురాయి కానుంది.

గతంలో పురుషులు, మహిళల మ్యాచ్ ఫీజులకు సంబంధించి సమాన వేతన విధానం తెచ్చిన బీసీసీ.. ఇప్పుడు అదే సూత్రాన్ని పనితీరు ఆధారిత రివార్డులకు కూడా విస్తరించాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. “పురుషులు, మహిళలకు సమాన వేతనాన్ని బీసీసీఐ సమర్ధిస్తుంది. మన అమ్మాయిలు ప్రపంచ కప్ గెలిస్తే, పురుషుల జట్టుకు ఇచ్చిన నగదు బహుమతికి సమానంగా ఉండేలా చర్చలు జరుగుతున్నాయి” అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

రోహిత్ టీమ్ కు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ..

గత సంవత్సరం రోహిత్ శర్మ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న జట్టుకు బీసీసీఐ 125 కోట్ల రూపాయల భారీ బోనస్‌ను ప్రకటించింది. క్రీడాకారులు, సహాయక సిబ్బందితో సహా ఈ బోనస్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మహిళల జట్టు గెలిస్తే, వారికి కూడా ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా వారి విజయానికి, భారత క్రికెట్‌కు చేసిన కృషికి అపూర్వమైన గుర్తింపు అవుతుంది.

2017లో లార్డ్స్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ చేతిలో తొమ్మిది పరుగుల తేడాతో ఓడింది. అయినప్పటికీ ప్రతి ప్లేయర్ కి 50 లక్షల రూపాయలు రివార్డ్ గా ఇచ్చారు. అదే సమయంలో కోచింగ్, సపోర్ట్ సిబ్బంది కూడా వారి కృషికి గుర్తింపు పొందారు. అది జరిగి 8 సంవత్సరాల గడిచాయి. ఈసారి భారత మహిళలు వరల్డ్ కప్ గెలిస్తే.. ప్రతి క్రికెటర్ తమ ప్రైజ్ మనీ 10 రెట్లు ఎక్కువగా అందుకోవచ్చు. ఇది ఆటలో సమానత్వం, గౌరవం, కొత్త శకానికి సంకేతం.

స్ఫూర్తిదాయకమైన హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో.. స్మృతి మంధాన, రేణుకా సింగ్ వంటి అత్యుత్తమ ప్లేయర్లతో భారత జట్టు బలంగా ఉంది. అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఆదివారం జరిగే తుది పోరులో భారత్ గెలిస్తే.. మనకు ఇదే మొట్టమొదటి మహిళా ప్రపంచ కప్ కానుంది. ఆల్ ద బెస్ట్ టు టీమిండియా.

Also Read: టెన్నిస్‌కి రోహన్‌ బోపన్న గుడ్‌ బై.. భావోద్వేగభరిత కామెంట్స్‌