వరల్డ్ కప్ దాకా దేవుడెరుగు… కోహ్లీ, రోహిత్ శర్మ ముందే రాంరాం కొట్టేస్తారా?
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, త్వరలో వారు వన్డే ఫార్మాట్‌కు కూడా..

Virat Kohli and Rohit Sharma
Virat Kohli Rohit Sharma: ఇండియా క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కీలక ప్లేయర్లు. వారి ఆటకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. వారు మైదానంలో ఉన్నారంటే స్టేడియం మొత్తం కోహ్లీ, రోహిత్ నామస్మరణతో మారుమోగిపోతుంది. అయితే, ఇంగ్లాండ్ వేదికగా ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు అటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అద్భుత ఆటతీరును కనబర్చారు. దీంతో భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నారు. 2027లో జరిగే వరల్డ్ కప్ వరకు వన్డే జట్టులో కొనసాగాలని వాళ్లు భావిస్తున్నారు. అయితే, బీసీసీఐ వారికి బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో జరిగే ఈ వన్డే సిరీస్ తరువాత రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటించాలని బీసీసీఐ ఒత్తిడి తెస్తుందన్న వాదన ఉంది.
కోహ్లీ, రోహిత్ శర్మలు తమ వన్డే కెరీర్‌లను 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగించాలని భావిస్తే.. వారు బీసీసీఐ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. అంటే.. ఈ సంవత్సరం చివర్లో జరిగే విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దరూ పాల్గొనాల్సి ఉంటుంది. దేశీయ టోర్నమెంట్లలో ఆడే పరిస్థితుల్లో వారు లేకుంటే ఆస్ట్రేలియాతో జరిగే వన్డేల తరువాత రిటైర్మెంట్లకు దారితీయొచ్చని నివేదిక తెలిపింది.
2027లో వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు ఇప్పటినుంచే యువ ఆటగాళపై దృష్టిసారించారు. వరల్డ్ కప్ నాటికి యువ ఆటగాళ్లతో అన్ని విభాగాల్లో కాంబినేషన్లను సెట్ చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ తరువాత రోహిత్, కోహ్లీలు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని బీసీసీఐ వర్గాలు సూచన ప్రాయంగా వారి దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను 2027 వరల్డ్ కప్ తుదిజట్టులో చూడగలమా అనే అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్టోబర్ 19న పెర్త్‌లో జరిగే మ్యాచ్ ద్వారా వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది, ఆ తర్వాత అడిలైడ్, సిడ్నీలలో మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబర్/డిసెంబర్ నెలల్లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్ జరగనుంది.