పుల్వామా ఎఫెక్ట్: ప్రభుత్వం ఆడొద్దని చెప్తే పాక్‌తో ఆడేది లేదు

పుల్వామా దాడి ఫలితంగా దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతోన్న ఆగ్రహ జ్వాలలు వరల్డ్ కప్ టోర్నీ వరకూ చేరాయి. ఈ మేర ప్రపంచ కప్ ట్రోఫీ కోసం జరిగే మ్యాచ్‌లలో పాకిస్తాన్‌తో భారత్ తలపడకూడదంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధికార ప్రతినిధి ఇలా మాట్లాడారు.
ఒకవేళ భారత ప్రభుత్వం వద్దని చెప్తే తాము ఆడబోమని స్పష్టం చేసింది. అలా ఆడకుండా ఉంటే పాకిస్తాన్ ఖాతాలో పాయింట్లు వచ్చి చేరతాయనే విషయాన్ని గుర్తు చేసింది. ఇందులో ఐసీసీ చేసేదేమీ లేదు. ఆడేందుకు ఇష్టం లేదనే నిర్ణయం చెప్తే.. పాయింట్లు ఇవ్వాల్సిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ ఫైనల్ వరకూ వెళితే అప్పుడైనా ఆడి తీరాల్సిందే. దీని గురించి ఐసీసీని ఇంకా సంప్రదించలేదని చెప్పారు.
మరోవైపు ఈ వాదనలు ఐసీసీ వరకూ చేరగా.. వీటిపై తమ స్పందన వ్యక్తం చేసింది. ‘భారత్‌పై జరిగి దాడిని మేం గమనించాం. అమరులైన కుటుంబాలకు మా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. వరల్డ్ కప్‌లో పాక్‌తో ఆడబోమని బీసీసీఐ నుంచి ఎటువంటి అభ్యర్థన మాకు రాలేదు. వచ్చిన తర్వాత దానిని బట్టి స్పందిస్తాం. అప్పటి వరకూ ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే జరుగుతుంది’ అని తెలియజేసింది.