Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో బుమ్రాకు చోటు ఉంటుందా..? అభిమానుల్లో టెన్షన్ టెన్షన్.. ఇవాళే చివరి అవకాశం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఈనెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.

Jasprit Bumrah: ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో బుమ్రాకు చోటు ఉంటుందా..? అభిమానుల్లో టెన్షన్ టెన్షన్.. ఇవాళే చివరి అవకాశం

Jasprit Bumrah

Updated On : February 11, 2025 / 7:23 AM IST

Jasprit Bumrah: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఈనెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాను కూడా ఎంపిక చేశారు. బుమ్రా భారత్ జట్టుకు ప్రధాన బౌలర్. అతను వెన్నునొప్పి కారణంగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే, బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత తుది జట్టులో చేరతాడా.. లేదా అనే విషయంపై బీసీసీఐ ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.

Also Read: IND vs ENG : ఇంగ్లాండ్‌కు మరో భారీ షాక్‌.. అసలే టీ20, వన్డే సిరీస్లు ఓడి ఏడుస్తున్న టైమ్ లో..

జస్ర్పీత్ బుమ్రా ఫిట్‌నెస్ నివేదిక కోసం భారత జట్టు యాజమాన్యం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పటికే అన్ని దేశాల టీంలు తమ జట్లను ప్రకటించాయి. అయితే, ఇప్పటికే ప్రకటించిన జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఇవాళ మధ్యాహ్నం వరకే అవకాశం ఉంటుంది. దీంతో బీసీసీఐ వెల్లడించే తుది జట్టులో జస్ర్పిత్ బుమ్రాకు అవకాశం దక్కుతుందా.. లేదా అనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ బుమ్రాను తప్పిస్తే అతని స్థానంలో పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

టోర్నీ మధ్యలో బుమ్రాను ఆడించాలనుకుంటే మాత్రం అతడిని 15 మంది బృందంలో కొనసాగించొచ్చు. అప్పుడు కూడా బుమ్రా అందుబాటులోకి రాకుంటే కొత్త ఆటగాడి ఎంపికకు ఐసీసీ సాంకేతిక కమిటీ అనుమతి తప్పనిసరి. అయితే, బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిదశలో అందుబాటులోకి వచ్చినా చాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రా ఫిట్ నెస్ పై ఎన్సీఏ తన నివేదికలో ఏమని పేర్కొటుంది.. బీసీసీఐ తుది జట్టులో బుమ్రాకు అవకాశం కల్పిస్తుందా.. అతని స్థానంలో కొత్తవారిని ఎంపిక చేస్తుందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Also Read: IND vs ENG: ఇంగ్లాండ్‌తో సిరీస్ విజయం తరువాత రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. శుభ్‌మ‌న్‌ గిల్, శ్రేయాస్ గురించి మాట్లాడుతూ..

జస్ర్పీత్ బుమ్రా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో గాయపడిన విషయం తెలిసిందే. వెన్నుగాయం తిరగబెట్టడంతో ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ మధ్యలో అతను బౌలింగ్ కు దూరమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ పూర్తిగా బౌలింగ్ చేయలేక పోయాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తరువాత స్వదేశానికి చేరుకున్న బుమ్రా ఎన్సీఏలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. బుమ్రాను ఫిట్ గా తయారు చేసే ప్రక్రియలో వైద్యబృందం నిమగ్నమైంది. అయితే, ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో జస్ర్పీత్ బుమ్రా ఉండటం ఎంతో కీలకమని బీసీసీఐ, భారత జట్టు యాజమాన్యం భావిస్తుంది. బుమ్రా ఫిట్ నెస్ పై వైద్య బృందం ఇవాళ తుది నివేదికను బీసీసీఐకి అందజేయనుంది. ఆ నివేదిక ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీకోసం వెళ్లే పదిహేను మంది జట్టు సభ్యుల్లో బుమ్రాను పంపించాలా.. లేదా అనే విషయంపై బీసీసీఐ ఇవాళ స్పష్టత ఇవ్వనుంది.