PVR INOX: ప్రకటనలతో నా సమయాన్ని వృథా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ పై వ్యక్తి ఫిర్యాదు.. నష్టపరిహారం చెల్లించాలంటూ కోర్టు ఆదేశం
సినిమాకు వెళ్తే ప్రకటనలతో, సినిమాల ట్రైలర్లతో నా సమయం వృథా చేశారంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు..

Bengaluru PVR-INOX
PVR INOX: నగరాల్లోని లగ్జరీ మల్టీప్లెక్స్ లలో సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు ప్రదర్శించే ప్రకటనల పట్ల చాలా మంది ప్రేక్షకులు విసిగిపోతుంటారు. ఇంకా ఎంతసేపు ప్రకటనలు వేస్తార్రా బాబూ అంటూ చిరాకు పడుతుంటారు. అయితే, ఈ విషయంపై బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. సినిమాకు వెళితే సినిమా ప్రారంభానికి ముందువేసే వాణిజ్య ప్రకటనలు, సినిమాల ట్రైలర్లు ప్రసారం వల్ల తన టైం వేస్ట్ చేశారంటూ కోర్టును ఆశ్రయించాడు. తాజాగా దీనిపై కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తికి నష్టపరిహారం కింద రూ. 65వేలు చెల్లించాలని ఐనాక్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే రూ.లక్ష జరిమానాకూడా విధించింది.
బెంగళూరుకు చెందిన అభిషేక్ ఎంఆర్ అనే వ్యక్తి బుక్ మైషో ద్వారా 2023 డిసెంబర్ 26న సాయంత్రం 4.05 గంటల సమయంలో సినిమాకోసం మూడు టికెట్లను బుక్ చేసుకున్నాడు. సినిమా పూర్తికాగానే ఆఫీస్ కు వెళ్లొచ్చని అనుకున్నాడు. సినిమా సమయానికి పీవీఆర్ ఐనాక్స్ కు వెళ్లాడు.. సినిమా 4.05 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. సినిమా ప్రారంభానికి ముందు సుమారు అర్ధగంటపాటు.. 4.30 గంటల వరకు ప్రకటనలు, పలు సినిమా ట్రైలర్లు ప్రదర్శించారు. సినిమా పూర్తయ్యే సరికి అర్ధగంట ఆలస్యమైంది. గతంలోనూ అతను ఇదే ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. దీంతో ఆ ప్రకటనలన్నీ తన ఫోన్ లో చిత్రీకరించాడు. మరుసటి రోజు తన వద్ద ఉన్న ఆధారాలతో పీవీఆర్ ఐనాక్స్ పై కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనికితోడు తన ఫిర్యాదులో బుక్ మై షోను కూడా చేర్చాడు.
తన ఫిర్యాదులో.. సినిమా ప్రారంభించడానికి ముందు అరగంట సేపు వాణిజ్య ప్రకటనలు, సినిమా ట్రైలర్లు ప్రసారం చేశారు. దీంతో సుమారు అర్ధగంట పాటు సినిమా ప్రదర్శనకు ఆలస్యమైంది. ఫలితంగా సినిమా పూర్తయ్యి నేను బయటకు వచ్చేందుకు అర్ధగంట ఆలస్యమైంది. ఆ సమయంలో తన షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది.. తద్వారా నా టైం అంతా వేస్ట్ చేశారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వినియోగదారుల కమిషన్ తాజాగా అతని ఫిర్యాదుపై తీర్పునిచ్చింది. సమయాన్ని డబ్బుగా పరిగణించాలని పేర్కొంది. ఆ వ్యక్తికి నష్టపరిహారం కింద రూ.65వేలు చెల్లించాలని పీవీఆర్ ఐనాక్స్ ను ఆదేశించింది. అదేవిధంగా అదనంగా రూ. లక్ష జరిమానా విధించింది. అయితే, బుక్ మైషో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. ఎందుకంటే.. బుక్ మైషో టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ కాబట్టి ప్రకటన స్ట్రీమింగ్ సమయంపై దానికి ఎటువంటి సంబంధం లేదని కోర్టు పేర్కొంది.