ICC World Cup 2023 : ప్రపంచ కప్ విజయం కోసం ఉజ్జయినీ మహంకాళీ దేవాలయంలో భస్మ హారతి
ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళ్ దేవాలయంలో ఆదివారం ఉదయం భస్మ హారతి ఇచ్చారు....

Bhasma Aarti
ICC World Cup 2023 : ఐసీసీ ప్రపంచ క్రికెట్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళ్ దేవాలయంలో ఆదివారం ఉదయం భస్మ హారతి ఇచ్చారు. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం ఆస్ట్రేలియా జట్టుతో జరగనున్న క్రికెట్ పోరులో టీమిండియా విజయం సాధించాలని కోరుతూ ఉజ్జయిని దేవాలయంతోపాటు దేశంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
శివాలయంలో ప్రత్యేక జలంతో అభిషేకం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బైధ్యనాథ్ మహదేవ్ దేవాలయంలో టీమిండియా విజయాన్ని కోరుతూ 11 మంది పండితులు ప్రత్యేక జలంతో అభిషేకం చేశారు. ఆస్ట్రేలియాపై భారత్ విజయాన్ని కాంక్షిస్తూ శివాలయంలో పాలు, పెరుగు, తేనేతో అభిషేకం చేశారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని భారత జట్టు ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించాలని ప్రార్థించారు.
సచిన్,కపిల్ దేవ్ రాక
ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ లు అహ్మదాబాద్ వెళ్లేందుకు ఆదివారం ఉదయం ముంబయి విమానాశ్రయానికి వచ్చారు. క్రికెట్ ఫైనల్ టోర్నీలో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పెద్ద ముప్పుగా మారబోతున్నాడని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డారు.
అహ్మదాబాద్‌లో గగనతలం మూసివేత
ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా ఆదివారం అహ్మదాబాద్ విమానాశ్రయం గగనతలాన్ని 45 నిమిషాల పాటు మూసివేయాలని నిర్ణయించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం భారతీయ వైమానిక దళం ప్రదర్శన కోసం ఆదివారం గగనతలం మూసివేస్తున్నట్లు విమానాశ్రయవర్గాలు వెల్లడించాయి.
ALSO READ : IND vs AUS : నేడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫైట్.. అహ్మదాబాద్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా ఢీ
గగనతలాన్ని ఆదివారం మధ్యాహ్నం 1:25 నుంచి 2:10 గంటల వరకు మూసివేయనున్నారు. క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రత్యేకంగా వాణిజ్య విమానాలను నడిపేందుకు అహ్మదాబాద్ విమానాశ్రయ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ALSO READ : DCP Jagadeeshwar Reddy : పోలీసుల అదుపులో ఖమ్మం కాంగ్రెస్ నేత వియ్యంకుడు
గగనతలం మూసివేత, రోడ్ల రద్దీ కారణంగా మ్యాచ్ చూడాలనుకునే ప్రేక్షకులు 3 గంటలు ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్ ఏషియా సూచించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు క్రికెట్ దిగ్గజాలు భారత్, ఆస్ట్రేలియాల చివరి షోడౌన్ పోరు జరగనుంది.