సెరెనాను ఓడించి..చరిత్ర సృష్టించి : యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్ ఛాంపియన్‌గా బియాంక

  • Published By: venkaiahnaidu ,Published On : September 9, 2019 / 02:59 AM IST
సెరెనాను ఓడించి..చరిత్ర సృష్టించి : యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్ ఛాంపియన్‌గా బియాంక

Updated On : September 9, 2019 / 2:59 AM IST

 టెన్నిస్‌ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో బియాంక ఆండ్రిస్కూ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది సూపర్ ఫామ్‌తో దూసుకెళుతున్న ఈ టీనేజర్‌ కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని సాధించింది.  కేవలం నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల అనుభవం కలిగిన బియాంక… ఆదివారం జరిగిన ఫైనల్స్ లో అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ను 6-3, 7-5 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సెరెనాను ఆరు సార్లు బ్రేక్‌ చేసిన బియాంక ఐదు ఏస్‌లు, 19 విన్నర్లు కొట్టింది. దీంతో కెనడా తరఫున తొలి గ్రాండ్‌స్లామ్‌ విన్నర్‌గా ఈ చిన్నది చరిత్ర సృష్టించింది.  మరోవైపు వరుసగా రెండో ఏడాదీ ఆర్థర్‌ యాషే స్టేడియంలో సెరెనాకు చుక్కెదురైనట్టయింది. 

ఈ ఏడాది మార్చి నుంచి బియాంకాకు అసలు ఓటమనేదే లేదు. ఈ మ్యాచ్‌ కోసం బియాంక ఎంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిందంటే.. తాను టాస్‌ నెగ్గినా ప్రపంచ టెన్నిస్ లో అత్యంత శక్తివంతమైన సెరెనాను ఎదుర్కొనేందుకే సిద్ధపడింది. దీనికి తగ్గట్టుగానే 33వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ ఆడిన సెరెనా తొలి గేమ్‌లోనే సర్వీస్‌ కోల్పోయింది. రెండు వరుస డబుల్‌ ఫాల్ట్‌లతో ప్రత్యర్థికి 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత బియాంక దూకుడు కొనసాగిస్తూ 2-0తో నిలిచింది. కానీ సెరెనా 2-4తో వెనకబడిన దశలో చెలరేగి బియాంక మూడు బ్రేక్‌ పాయింట్లకు అడ్డుగా నిలుస్తూ శక్తివంతమైన ఏస్‌లు, గ్రౌండ్‌స్ట్రోక్‌ షాట్లతో 3-4తో సర్వీ‌సను కాపాడుకుంది. అయితే ఆ తర్వాత బియాంక తన సర్వీ‌సను నిలబెట్టుకొంటూ, ప్రత్యర్థి సర్వీ‌సను బ్రేక్‌ చేస్తూ తొలి సెట్‌ను 6-3తో ముగించింది.

రెండో సెట్‌ ఆరంభంలో బియాంకా విరుచుకుపడింది. చక్కటి ప్లేస్‌మెంట్‌తో తొలి రెండు గేమ్‌లను సునాయాసంగా నెగ్గింది. అటు సెరెనా డబుల్‌ ఫాల్ట్‌లు కూడా ఆమెకు తోడ్పడ్డాయి. ఈ దశలో చూస్తుండగానే రెండో సెట్‌లో బియాంక 5-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఛాంపియన్‌షిప్‌ పాయింట్‌ కోసం సర్వీస్‌ ఆరంభించిన బియాంకకు అంత సులువుగా సెరెనా తలవంచలేదు. ఈ స్థితిలో అసమాన ఆటతీరును ప్రదర్శించింది. పవర్‌ఫుల్‌ ఫోర్‌హ్యాండ్‌ రిటర్న్‌ విన్నర్‌తో 2-5కి ఆమె ఆధిక్యం తగ్గించింది. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకుని 5-5తో సమంగా నిలిచింది. దీంతో 24 వేల సామర్థ్యం కలిగిన ఆర్థర్‌ ఆషే స్టేడియం హర్షధ్వానాలతో మోతెక్కింది. కానీ ఈ అవకాశాన్ని ఒత్తిడిలో ఉన్న సెరెనా ఉపయోగించుకోలేకపోయింది. కీలక దశలో ఆట గతి తప్పడంతో అటు వరుసగా రెండు పాయింట్లు సాధించిన బియాంక ఫోర్‌హ్యాండ్‌ రిటర్న్‌తో మ్యాచ్‌కు ముగింపునిచ్చింది. అంతేకాకుండా ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ప్రత్యర్థుల మధ్య 18 ఏళ్లు వయస్సు తేడా ఉండటం కూడా ఇదే మొదటిసారి.గ త 15 ఏళ్లలో గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన అత్యంత పిన్నవయస్కురాలిగానూ నిలిచింది.

అయితే గతంలో కేవలం మూడు గ్రాండ్ స్లామ్ లు ఆడిన అనుభవం..ఎన్నడూ రెండో రౌండ్ దాటింది కూడా లేకపోయినప్పటికీ  కెనడియన్ బ్యూటీ బియాంక(19) చరిత్ర సృష్టించడంపై క్రీడా ప్రపంచం నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి