మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెడుతున్న సచిన్,యువీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 8, 2020 / 05:50 PM IST
మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెడుతున్న సచిన్,యువీ

Updated On : February 8, 2020 / 5:50 PM IST

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. క్రికెట్ లెజెంట్ సచిన్,సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్ మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెటుతున్నారు. ఇప్పటికే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స‌చిన్ టెండూల్క‌ర్‌, ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ ఆదివారం(ఫిబ్రవరి-9,2020) మ‌ళ్లీ మైదానంలో సంద‌డి చేయ‌నున్నారు. ఆస్ట్రేలియాలో జ‌రిగే మ్యాచ్‌లో అభిమానుల‌ను అల‌రించ‌నున్నారు. కార్చిచ్చు కార‌ణంగా న‌ష్ట‌పోయిన వారిని ఆదుకునేందుకుగాను ఆస్ట్రేలియా బుష్ఫైర్ క్రికెట్ బాష్ 2020 మ్యాచ్ నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లోని రెండు జ‌ట్ల‌కు ఒక‌వైపు పాంటింగ్‌, మ‌రోవైపు గిల్‌క్రిస్ట్ సార‌థ్యం వ‌హిస్తున్నారు. వాస్తవానికిఈ మ్యాచ్ శ‌నివార‌మే జ‌ర‌గాల్సి ఉండ‌గా.. వ‌ర్షం కార‌ణంగా ఆదివారానికి వాయిదా ప‌డింది. ఈ మ్యాచ్ లో ఇందులో సచిన్, యువీ స‌హా ఎంతోమంది లెజెండ‌రీ ప్లేయ‌ర్లు బరిలోకి దిగుతున్నారు. భార‌త్ నుంచి సచిన్ కోచ్ పాత్ర పోషిస్తుండగా.. యువీ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. మిగ‌తా వారిలో ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్‌, రికీ పాంటింగ్, షేన్‌వార్న్‌, మ‌థ్యూ హేడెన్‌, కోట్నీ వాల్ష్‌, బ్రియాన్ లారా, జ‌స్టిన్ లాంగ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అడుగుపెడుతున్న స‌చిన్..స‌త్తాచాటాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదివారం ఉద‌యం 9:45గంటలకు మెల్ బోర్న్ లోని జంక్షన్ ఒవెల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభ‌మ‌వుతుంది. ఇరుజ‌ట్లు ప‌ది ఓవ‌ర్లు చొప్పున ఆడ‌నున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా సేక‌రించిన నిధుల‌ను కార్చిచ్చు బాధితుల‌కు అందించ‌నున్నారు.

ఆస్ట్రేలియాలో ఇటీవల కార్చిచ్చు కారణంగా దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా కోట్ల సంఖ్యలో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. కార్చిచ్చు దెబ్బ నుంచి ఇంకా ఆస్ట్రేలియా కోలుకోలేదు. కార్చిచ్చు కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.