Team India : చేజారిన కప్.. ఉబికి వచ్చిన కన్నీటిని ఆపుకోలేక..
Team India players : ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమ్ఇండియా ఆటగాళ్లు మాత్రం విచారంలో ముగినిపోయారు.

Crying Visuals Of Team India
ఎన్నో అంచనాలతో టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లే వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకువెళ్లింది. ఇండియా ఊపు చూసిన అభిమానులు ఖచ్చితంగా భారత జట్టు మూడో సారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడుతుందని భావించారు. అయితే.. 140 మంది కోట్ల భారతీయుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.
ఆరోసారి ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఆఖరి మెట్టుపై బోల్తా పడిన టీమ్ఇండియా ఆటగాళ్లు మాత్రం విచారంలో ముగినిపోయారు. స్టార్ ఆటగాళ్లు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు మహ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
This is absolutely heartbreaking…!!!! 💔💔💔 pic.twitter.com/NzPJLhmTdp
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
విరాట్‌ను ఓదార్చిన అనుష్క శర్మ..
ఈ ప్రపంచకప్ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడాడు. 11 మ్యాచుల్లో 765 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన కింగ్ కోహ్లీ, ఆసీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అర్ధశతకం చేశాడు. తన కెరీర్‌లో రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను అందుకోవాలని భావించిన విరాట్ కు నిరాశే ఎదురైంది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైయ్యాడు.
మైదానం నుంచి నేరుగా స్టాండ్స్ వైళ్లాడు. అక్కడే ఉన్న అతడి భార్య అనుష్క శర్మ కోహ్లీకి అండగా నిలిచింది. భర్తను కౌగిలించుకుని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. కాగా.. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఇంతక ముందు ఈ రికార్డు భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 2023 ప్రపంచకప్‌లో 673 పరుగులు చేశాడు.
Also Read: ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా కోహ్లీ.. ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయంటే..?
View this post on Instagram
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది. విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66), కెప్టెన్ రోహిత్ శర్మ (47) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో రెండు, మాక్స్‌వెల్, జంపాలు ఒక్కొ వికెట్ తీశారు. అనంతరం ట్రావిస్ హెడ్ (137) శతకం చేయడంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు, మహ్మద్ షమీ, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ తీశారు.