భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్టు జరుగుతుందా ? కారణమిదేనా

India vs Australia : బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన భారత్ – ఆస్ట్రేలియా నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్వీన్స్‌ల్యాండ్ హెల్త్ మినిస్టర్ వివాదస్పద వ్యాఖ్యలు, హోటల్ గదికే పరిమితమవ్వాలన్న కఠిన నిబంధనలు, బ్రిస్బేన్‌లో లాక్‌డౌన్ విధించడం వంటి కారణాలు ఇప్పుడు చివరి టెస్ట్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.. అయితే ఈ టెస్ట్ రద్దుకు మరో కారణం ఉందంటూ ఓ వార్త వెలుగులోకి వచ్చింది.
షెడ్యూల్ ప్రకారం ఇండియాలో ఇంగ్లాండ్ సిరీస్ నిర్వహించడం కోసం బీసీసీఐ ఆఖరి టెస్టు రద్దు చేసే ఆలోచనలో ఉందన్న వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.. ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతున్న సిడ్నీలో ఎలాంటి కొత్త స్ట్రెయిన్ కేసులు లేవు.. కానీ బ్రిస్బేన్‌లో ఇప్పటికే ఒక కేసు నమోదైంది. లాస్ట్ టెస్ట్ ముగిసేలోపు అక్కడ కొత్త కేసులు పెరిగినా.. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వారిపై కఠిన క్వారంటైన్ నిబంధనలు విధించినా టీమ్ ఇండియాకు ఇబ్బందులు తప్పవు.
ఆసీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లంతా క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. అలా జరిగితే ఇంగ్లాండ్ సిరీస్‌పై ప్రభావం పడుతుందని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చివరి టెస్ట్ రద్దుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్టులు, అయిదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. మరి చివరి టెస్ట్‌పై బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.