Shubman Gill : ఐసీసీ జరిమానా నుంచి తెలివిగా తప్పించుకున్న శుభ్‌మన్ గిల్.. ఎలాగో తెలుసా ?
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినప్పటికి తృటిలో శిక్ష నుంచి తప్పించుకున్నాడు.

ENG vs IND 3rd Test Gill Cleverly Escapes ICC Penalty For Code Of Conduct Breach
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించినప్పటికి తృటిలో శిక్ష నుంచి తప్పించుకున్నాడు. గురువారం (జూలై 10) నుంచి లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే.. మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సమయంలో శుభ్‌మన్ గిల్ తన టెస్టు జెర్సీ కింద ఎరువు రంగు టీ షర్టు వేసుకుని కనిపించాడు. టెస్టు మ్యాచ్‌ల్లో ఐసీసీ నిబంధనల ప్రకారం.. చొక్కా కింద కనిపించే ఏవైనా సరే తెలుపు రంగులో తప్ప మరే ఇతర రంగులో ఉండకూడదు. ఆటగాళ్లు ఈ నియమాన్ని పాటిస్తున్నారా లేదా అనేది ఐసీసీ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘించినట్లుగా తేలితే జరిమానా విధిస్తుంది.
అయితే.. అదృష్ట వశాత్తు ఈ విషయాన్ని గిల్ చాలా త్వరగానే గ్రహించాడు. మ్యాచ్ తొలి సెషన్ కోసం మైదానంలో అడుగుపెట్టిన సమయంలో తన షర్టు బటన్‌ను పెట్టుకోవడం ద్వారా దాన్ని కనిపించకుండా చేశాడు. దీంతో అతడు పెనాల్టీ నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేసింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (53), రిషభ్ పంత్ (19) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.