ENG vs IND : లడ్డూ లాంటి క్యాచ్‌ను మిస్ చేసిన కేఎల్ రాహుల్.. సిరాజ్ రియాక్షన్ వైరల్..
రెండో రోజు ఆటలో స్లిప్‌లో కేఎల్ రాహుల్ ఎంతో సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు.

KL Rahul drops easiest catch Mohammed Siraj reaction viral
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా ఫీల్డింగ్ చాలా సాధారణంగా ఉంది. ఈజీ క్యాచ్‌లను కూడా మిస్ చేస్తున్నారు. క్యాచ్‌లను వదిలివేయడంతో ఇప్పటికే తొలి టెస్టులో ఓడిపోయారు. ఇక ఇప్పుడు లండన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోనూ భారత్ ఆటగాళ్లు పలు క్యాచ్‌లను జారవిడిచారు. రెండో రోజు ఆటలో స్లిప్‌లో కేఎల్ రాహుల్ ఎంతో సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జేమీ స్మిత్.. ఇంగ్లాండ్ మెరుగైన స్కోరు సాధించేందుకు దోహదపడ్డాడు,
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 87వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను సిరాజ్ వేశాడు. ఈ ఓవర్‌లోని మూడో బంతిని జేమీ స్మిత్ షాట్ ఆడగా ఎడ్జ్ తీసుకున్న బంతి రెండో స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ వైపుగా వచ్చింది. తన కుడి చేతి వైపు రెండు చేతులతో బంతిని ఒడిసి పట్టుకునేందుకు కేఎల్ ప్రయత్నించాడు. అయితే.. బంతి అతడి చేతి వేళ్లను తగిలి వెళ్లిపోయింది. అప్పుడు జేమీ స్మిత్ స్కోరు 5 పరుగులు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) July 11, 2025
ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు హాఫ్ సెంచరీ (51) పరుగులతో చెలరేగిపోయాడు. బ్రైడాన్ కార్స్ (56)తో కలిసి అతడు ఎనిమిదో వికెట్ కు 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ స్కోరు 350 పరుగులు దాటేలా చేశాడు. ఒకవేళ రాహుల్ గనుక క్యాచ్ అందుకుని ఉంటే ఇంగ్లాండ్ 300 లోపే ఆలౌట్ అయ్యే అవకాశాలు ఉండేవి.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జో రూట్ (104) సెంచరీ చేయగా.. జేమీ స్మిత్ (51), బ్రైడాన్ కార్స్ (56)లు హాఫ్ సెంచరీలు చేశాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. నితీశ్‌కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా ఓ వికెట్ సాధించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (53), రిషబ్ పంత్ (19) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.