ENG vs IND : ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చిన బుమ్రా!
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐకి భారత పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఓ షాకింగ్ వార్త చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ENG vs IND Bumrah Gives Bad News To BCCI Before Selection Meeting
వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత జట్టును శనివారం (మే 24న) బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో వీరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారు? రహానే, పుజారాలు రీ ఎంట్రీ ఇస్తారా? దేశవాలీతో పాటు ఐపీఎల్‌లో అదరగొడుతున్న కరుణ్ నాయర్‌కు మళ్లీ అవకాశం ఇస్తారా? కెప్టెన్ ఎవరు అన్న ఉత్కంఠ అందరిలో ఉంది?
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు బీసీసీఐకి టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఓ షాకింగ్ వార్త చెప్పినట్లు ఆంగ్లమీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను అన్ని టెస్టులు ఆడనని, ఓ మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటానని వెల్లడించాడు. అంతకు మించి ఆడితే తన శరీరం పై అధిక భారం పడే అవకాశం ఉందని, తద్వారా గాయాలు తిరగబెట్టే అవకాశం ఉందని చెప్పినట్లు సదరు వార్తల సారాంశం.
వెన్నునొప్పి..
గత కొంతకాలంగా బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడింది. ఈ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్‌లను బుమ్రా ఆడాడు. అయితే.. ఐదో టెస్టు సమయంలో అతడు వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు బౌలింగ్ చేయలేదు. ఆ తరువాత కొంతకాలం పాటు ఆటకు దూరం అయ్యాడు. ఐపీఎల్ ఆరంభంలోని ప్రారంభ మ్యాచ్‌లకు సైతం దూరంగా ఉన్నాడు.
ఇక బుమ్రాను టెస్ట్ కెప్టెన్సీకి పరిగణించకపోవడానికి అతని వెన్నుముక సమస్య ఒక కారణమని భావిస్తున్నారు. అతను దాదాపు మూడేళ్ల పాటు రెడ్-బాల్ క్రికెట్‌లో రోహిత్‌కు డిప్యూటీగా ఉన్నాడు. దీంతో అందరూ అతడు కొత్త కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని భావించారు. కానీ అతని వెన్నుముక సమస్య కారణంగా అతను నాయకుడు కాలేకపోతున్నట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్సీని సైతం కోల్పోయే అవకాశం ఉంది.
శుభ్‌మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. బుమ్రా స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. 2018లో అరంగేట్రం చేసినప్పటి నుండి రిషబ్ టెస్ట్ జట్టులో రెగ్యులర్‌గా సభ్యుడిగా ఉంటున్నాడు.