ENG vs IND : ఆడితే అన్ని ఆడు.. లేకుంటే లేదు.. నీ ఇష్టం వచ్చినట్లు ఆడితే.. బుమ్రా పై మాజీ సెలక్టర్ ఫైర్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడకపోవడాన్ని మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ తప్పుబట్టాడు.

ENG vs IND Dilip Vengsarkar fires on jasprit bumrah
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడకపోవడాన్ని భారత మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ తప్పుబట్టాడు. బుమ్రా పనిభారం నిర్వహణ ప్రణాళికలను తీవ్రంగా విమర్శించాడు. అతడు ఫిట్‌గా లేకుంటే సిరీస్ మొత్తానికే దూరంగా ఉండాలన్నాడు. అంతే కానీ కొన్ని మ్యాచ్‌లే ఆడతాడని అనడం సరికాదన్నాడు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని చీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే వెల్లడించాడు. ఇక హెడ్ కోచ్ గంభీర్ సైతం సిరీస్ ప్రారంభమైన తరువాత ఇదే విషయాన్ని చెప్పాడు.
Karun Nair : ఇందుకేనా మరో ఛాన్స్ అడిగింది.. ఇక కష్టమే.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే..
తరుచుగా గాయాల పాలు అవుతుండడంతో సిరీస్‌లో కేవలం మూడు టెస్టులకు మాత్రమే తనను పరిగణించాలని బుమ్రా బీసీసీఐని విజ్ఞప్తి చేసినట్లుగా వార్తలు వచ్చాయి. పనిభారాన్ని నిర్వహించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య బృందం తనకు చెప్పినట్లు బుమ్రా వెల్లడించాడు.
ఈ క్రమంలో ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఆడిన బుమ్రా, రెండో టెస్టుకు దూరం అయ్యాడు. ఇక మూడో టెస్టు మ్యాచ్‌లో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌లో 1-2తేడాతో వెనుకబడి ఉన్న నేపథ్యంలో సిరీస్‌ను సమం చేయాలంటే నాలుగో టెస్టు మ్యాచ్ ఎంతో కీలకం. అయితే.. ఈ మ్యాచ్‌కు బుమ్రా దూరం అవుతాడు అనే ప్రచారం జరుగుతోంది. మాజీ ఆటగాళ్లు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. నాలుగో టెస్టు మ్యాచ్‌కు 8 రోజుల విరామం లభించిందని, బుమ్రా ఖచ్చితంగా ఆడాలని సూచిస్తున్నారు.
దీనిపై ఓఛానెల్‌తో మాట్లాడుతూ దిలీప్ వెంగ్ సర్కార్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఏ మ్యాచ్‌లు ఆడాలి అనే విషయాన్ని ఆటగాళ్లు ఎంపిక చేసుకోవడాన్ని తాను ఇష్టపడనని చెప్పాడు. ఫిట్‌గా ఉంటే అన్ని మ్యాచ్‌లు ఆడాలని, లేకుంటే సిరీస్ మొత్తానికి దూరంగా ఉండాలని సూచించాడు.
‘బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు దేశాన్ని గెలిపించగలడు. ఒక్కసారి మీరు విదేశీ పర్యటనకు వచ్చారంటే.. జట్టు తరుపున ప్రతి మ్యాచ్ ఆడాల్సిందే. వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా మ్యాచ్‌లను ఎంచుకునే ఆస్కారం ఉండదు.’ అని దిలీప్ వెంగ్‌సర్కార్ అన్నాడు.