Team India : టీమ్ఇండియా బస చేస్తున్న హోటల్ వద్ద అనుమానాస్పద పార్సిల్.. గదులకే పరిమితమైన భారత క్రికెటర్లు..
భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ సమీపంలో ఓ అనుమానాస్పద పార్సిల్ కనిపించింది.

Security Threat Forces Team India To Remain Indoors
భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ సమీపంలో ఓ అనుమానాస్పద పార్సిల్ కనిపించింది. దీంతో ఆటగాళ్లు హోటల్ రూమ్‌లకే పరిమితం కావాల్సి వచ్చింది.
మంగళవారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని బస చేస్తున్న హోటల్ కు చేరుకున్నారు. ఆ సమయంలో బర్మింగ్‌హామ్‌లోని సెంటనరీ స్క్వేర్ వద్ద అనుమానాస్పద ప్యాకెట్‌ను గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సమీపంలోని బిల్డింగ్స్‌లో ఉన్న వారిని చెక్ చేశారు. టీమ్ఇండియా క్రికెటర్లు బస చేస్తున్న హోటల్‌ను కూడా సీజ్ చేశారు.
ఒక గంట తరువాత కార్డన్ సెర్చ్‌ను ఎత్తి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పార్శిల్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించినట్లు వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు తెలిపారు.
ఇక భారత జట్టు రెండో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైంది. పలు మార్పులతో రెండో టెస్టులో బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి టెస్టులో విఫలమైన ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ రెడ్డికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. స్పిన్ విభాగాన్ని మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో కీలక పరుగులు రాబట్టే వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవాలని మేనేజ్‌మెంట్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది.