Eng Vs Ind: చరిత్ర సృష్టించిన భారత్.. రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై ఘన విజయం

ఈ గెలుపుతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది.

Eng Vs Ind: చరిత్ర సృష్టించిన భారత్.. రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై ఘన విజయం

Updated On : July 6, 2025 / 11:44 PM IST

Eng Vs Ind: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 608 పరుగుల ప్రపంచ రికార్డ్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 271 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 336 రన్స్ భారీ తేడాతో విక్టరీ కొట్టింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్ లో 407 రన్స్ చేసింది. నాలుగో రోజు ఆటలో భారత జట్టు రెండో ఇన్నింగ్స్ ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ కలుపుకొని ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో భారత బౌలర్ ఆకాశ్ దీప్ చెలరేగిపోయాడు. 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు. భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ ను భారత్ 1-1తో సమం చేసింది. కాగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టుకు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం.

ఈ సిరీస్‌లో కెప్టెన్‌ గిల్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో అదరగొట్టాడు.

ఈ విజయంతో ఏకంగా 58 ఏళ్ల భారత జట్టు నిరీక్షణకు తెరపడింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి విజయం. 1967లో ఈ వేదికపై తొలిసారి ఆడిన తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు ఇదే మొట్టమొదటి టెస్ట్ విజయం.

స్కోర్లు..
భారత్ – 587, 427/6 డిక్లేర్
ఇంగ్లాండ్ – 407, 271

* ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ తొలి టెస్ట్ విజయాన్ని సాధించింది.
* సిరీస్ సమం. తొమ్మిది ప్రయత్నాల్లో తొలిసారి ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టెస్ట్‌లో భారత్ గెలుపొందింది.
* ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా భారత్ రికార్డ్.
* శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు చరిత్రాత్మక గెలుపు.
* ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 10 వికెట్లు తీసిన బౌలర్ గా ఆకాశ్‌దీప్ ఘనత.
* ఒక విదేశీ బౌలర్ చేసిన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలలో ఇదొకటి.