Tilak varma : వన్డే ప్రపంచకప్ రేసులో హైదరాబాదీ కుర్రాడు..? కష్టమే అయినా అసాధ్యం కాదు..!
భారత క్రికెట్‌లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో అరంగ్రేటం చేసిన ఈ హైదరాబాదీ కుర్రాడు 39, 51, 49 నాటౌట్ స్కోర్లతో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.
Tilak varma- ODI World Cup : భారత క్రికెట్‌లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు తిలక్ వర్మ. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో అరంగ్రేటం చేసిన ఈ హైదరాబాదీ కుర్రాడు 39, 51, 49 నాటౌట్ స్కోర్లతో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ జట్టు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చాడు. ఎంతో పరిణితి ఉన్న ఆటగాడిగా మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుంటూ అందుకు తగ్గట్లుగా తన బ్యాటింగ్ తీరును మార్చుకుంటూ అవసరమైన సమయంలో అలవోకగా భారీ షాట్లు ఆడాడు. 20 ఏళ్ల వయసులోనే అతడు చూపిస్తున్న పరిణితి గురించే ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు.
Spencer Johnson: ఎవరీ స్పెన్సర్ జాన్సన్? అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ సంచలనం
స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ టోర్నీలో ఆడే టీమ్ఇండియా జట్టుపై ఇప్పటికే సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఓ అంచనాకు వచ్చి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా తిలక్ వర్మను ప్రపంచకప్‌కు పరిగణలోకి తీసుకోవాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వెస్టిండీస్‌తో టీ20ల్లో తిలక్ వర్మ ఆట ఎంతో ఆకట్టుకుందని, అతడు మ్యాచ్‌లను ముగిస్తుంటే చూడడం ఎంతో ఆనందంగా ఉందని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నాడు. ప్రపంచకప్‌కు కోసం టీమ్ఇండియా పరిశీలించదగ్గ ఆటగాళ్లలో అతడు ఒకడని చెప్పారు.
ఐపీఎల్‌లో అదరగొట్టాడు
ఐపీఎల్‌లో గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతూ అదరగొడుతున్నాడు తిలక్ వర్మ, తొలి సీజన్‌లో 14 మ్యాచుల్లో 36.09 సగటుతో 131.02 స్ట్రైక్ రేట్‌తో 397 పరుగులు చేశాడు. ఇక రెండో సీజన్‌లో అయితే.. మరింత చెలరేగిపోయాడు. 11 మ్యాచ్‌ల్లో 42.87 సగటుతో 164.11 స్ట్రైక్ రేట్‌తో 343 పరుగులు సాధించాడు. జట్టు క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడు క్రీజులో నిలిచి బ్యాటింగ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
Prithvi Shaw : పృథ్వీ షా వీర విహారం.. డబుల్ సెంచరీ.. 28 ఫోర్లు, 11 సిక్సర్లు.. రీ ఎంట్రీకి సిద్ధం..!
వన్డేల్లో రాణిస్తాడా..?
టీ20ల్లో అదరగొట్టిన చాలా మంది ఆటగాళ్లు వన్డే మ్యాచుల విషయానికి వస్తే తేలిపోయారు. ఇందుకు చక్కని ఉదాహారణ సూర్యకుమార్ యాదవ్. టీ20ల్లో ప్రపంచ నంబర్ ర్యాంక్‌ను సొంత చేసుకున్న సూర్య.. వన్డేల్లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. అతడిపై నమ్మకం ఉంచిన టీమ్ మేనేజ్‌మెంట్ వరుసగా అవకాశాలు ఇస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా తనదైన మార్క్‌ను చూపించలేకపోయాడు. మరీ టీ20ల్లో అదరగొడుతున్న తిలక్ వర్మ వన్డేల్లో ఎలా ఆడతాడు అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది.
అయితే.. ఆ భయం అక్కరలేదని, లిస్ట్-ఏ క్రికెట్‌లో తిలక్ వర్మకు అద్భుతమైన గణాంకాలు ఉన్నాయని, అతడిని వన్డేల్లో ఆడిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చునని అంటున్నాడు భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్‌కే ప్రసాద్. లిస్ట్-ఏ క్రికెట్‌లో హైదరాబాద్ తరుపున 25 మ్యాచులు ఆడిన తిలక్ 56.18 సగటుతో 1,236 పరుగులు చేశాడు. ఐదు శతకాలు, ఐదు అర్థశతకాలు సాధించాడు. అంటే కనీసం యాభై శాతం అయినా తన ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచెరీలను సెంచరీలుగా మార్చాడు. ఇక స్ట్రైక్‌రేటు కూడా 100 పైనే ఉంది.
ప్రపంచకప్‌కు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది..?
ప్రపంచకప్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్న నేపథ్యంలో తిలక్ వర్మ వన్డే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశాలు కొట్టిపారేయలేము. ఎందుకంటే టీ20ల్లో అతడు మంచి టెక్నిక్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అడ్డదిట్టంగా షాట్లు ఆడడం లేదు. పరిస్థితులకు తగ్గట్లుగా తన బ్యాటింగ్ విధానాన్ని మార్చుకుంటున్నాడు. ముఖ్యంగా ఎక్కువ క్రీజులో నిలుస్తున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడం కూడా అతడికి కలిసి వచ్చే అంశం.
ధోని రిటైర్‌మెంట్ కావడంతో ఫినిషర్ లేని లోటును భారత్‌ను వెంటాడుతోంది. ఆ పాత్రకు తిలక్ చక్కగా సరిపోతాడు. ఇంకోవైపు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లు గాయాల నుంచి కోలుకుంటున్నారు. వారి ఫిట్‌నెస్‌పై ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న వీరిద్దరిని నేరుగా ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారా..? అన్న సందేహాలు ఉన్నాయి. సూర్యకుమార్ వన్డేల్లో రాణించలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో తిలక్ వర్మ ఇదే నిలకడను కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రపంచకప్ రేసులో అతడు ఉండే అవకాశం ఉంది. సెలక్టర్లు గనుక అతడిని పరీక్షించాలనుకుంటే ఆసియా కప్‌కు ఎంపిక చేయవచ్చు. అక్కడ గనుక తిలక్ రాణిస్తే ప్రపంచకప్ బెర్తు సొంతం చేసుకోవడం పెద్ద కష్టం కాదు.