Champions Trophy: టీమిండియా విజయంపై పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక కామెంట్స్.. పీసీబీ తీరుపై ఆగ్రహం
భారత్ జట్టు విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా ..

Shoaib Akhtar
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత జట్టు నిలిచింది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. తద్వారా టీమిండియా 12ఏళ్ల విరామం తరువాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకుంది. అయితే, భారత్ జట్టు విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియాకు అభినందనలు తెలిపారు.
ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజయం తరువాత షోయబ్ అక్తర్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో అక్తర్ మాట్లాడుతూ భారత్ జట్టు విజయంపై కీలక కామెంట్స్ చేశాడు. ‘‘గత 10 సంవత్సరాలలో టీమిండియా ఐసీసీ టోర్నమెంట్లలో అత్యుత్తమ జట్టుగా అవతరించింది. గత సంవత్సరం కూడా టీ20 ట్రోఫీని గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అద్భుతాలు చేసింది. రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన విధానం బాగుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత భారత్ జట్టుకు అభినందనలు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా భారత్ జట్టు ఓడిపోలేదు. టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హమైనది’’. అంటూ అక్తర్ పేర్కొన్నారు.
The best team of the tournament has won the Champions Trophy. That too without dropping a single match!! #India #championstrophy2025 pic.twitter.com/KUytSNyQi7
— Shoaib Akhtar (@shoaib100mph) March 9, 2025
మరో వీడియోలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై అక్తర్ విమర్శలు చేశాడు. ‘‘భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఇక్కడ నేనొక విషయం గమనించా. పాకిస్థాన్ ఆతిథ్య దేశం. కానీ, ట్రోఫీ అందజేసే కార్యక్రమంలో పాక్ కు చెందిన ఒక్క ప్రతినిధి లేకపోవటం ఆశ్చర్యం కలిగించింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకు పీసీబీ నుంచి ఒక్కరూ లేరు..? దీని గురించి ఆలోచించాలి. ఇది ఐసీసీ కార్యక్రమం. కానీ, పీసీబీ సభ్యులు లేరు. అలా చూడటం చాలా బాధగా ఉంది. ఎందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతినిధిని పంపించలేదు..?’’ అంటూ అక్తర్ ప్రశ్నించారు.
This is literally beyond my understanding.
How can this be done???#championstrophy2025 pic.twitter.com/CPIUgevFj9— Shoaib Akhtar (@shoaib100mph) March 9, 2025
ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. భారత్ స్పిన్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. కుల్దీప్ యాదవ్ రెండు, వరుణ్ చక్రవర్తి రెండు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. కట్టుదిట్టమైన బౌలింగ్ లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే శుభారంభం లభించింది. రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి దూకుడుగా ఆడాడు.. తద్వారా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. భారత్ 49 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించింది. భారత్ ఆటగాళ్లలో రోహిత్ (76) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇదిలాఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రైజ్‌మనీగా 2.24 మిలియన్ల యూఎస్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.19.52 కోట్లు, రన్నరప్ జట్టుకు 1.12 మిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.9.76 కోట్లు లభించనుంది. ఇక సెమీస్‌లో ఓడిన ఒక్కో జట్టుకు రూ.4.88 కోట్లు.. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లలో ఒక్కో జట్టుకు రూ.3.05 కోట్లు, ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్న జట్లు రూ.1.22 కోట్లు అందనుంది.