పాకిస్థాన్‌ టీమ్‌ని అంత మాట అంటావా? అంటూ షాహిద్ అఫ్రిదీపై పీసీబీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నాయకత్వం, ఛైర్మన్, డైరెక్టర్లు సహా ఆ వ్యవస్థ అంతా బలహీనంగా ఉందని మణి అంగీకరించారు. 

పాకిస్థాన్‌ టీమ్‌ని అంత మాట అంటావా? అంటూ షాహిద్ అఫ్రిదీపై పీసీబీ మాజీ ఛైర్మన్ ఆగ్రహం

Updated On : March 15, 2025 / 8:17 PM IST

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన నేపథ్యంలో “పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది” అని ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ అన్న విషయం తెలిసిందే. అలాగే, దేశీయ క్రికెట్‌లో గత 10 మ్యాచ్‌ల్లో సరిగ్గా ఆడని షాదాబ్ ఖాన్‌ను న్యూజిలాండ్‌లో జరిగే ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌ ఎంపిక చేసినందుకు సెలక్టర్లను షాహిద్ అఫ్రిదీ విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై పీసీబీ మాజీ ఛైర్మన్ ఎహ్సాన్ మణి తీవ్రంగా స్పందించారు.

ఎహ్సాన్ మణి మాట్లాడుతూ.. అఫ్రిదీ విమర్శలను తప్పుబట్టారు. అఫ్రిదీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని, ఆయన అభిప్రాయాలకు పెద్దగా విలువ లేదని అన్నారు.

అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నాయకత్వం, ఛైర్మన్, డైరెక్టర్లు సహా ఆ వ్యవస్థ అంతా బలహీనంగా ఉందని మణి అంగీకరించారు. పీసీబీ ఛైర్మన్, డైరెక్టర్లు పాకిస్థాన్ క్రికెట్‌ను ముందుకు నడిపించాల్సిన బాధ్యతను వహించాలని చెప్పారు. మిగతా విమర్శల గురించి తాను పట్టించుకోనని తెలిపారు.

Also Read: పాకిస్థాన్ ఇలాగే పేలవంగా ఆడడాన్ని కొనసాగించిందనుకో.. ఇక..: పాక్ మాజీ ఆల్‌రౌండర్ సంచలన కామెంట్స్

గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ క్రికెట్‌లో కెప్టెన్ల మార్పులు, కోచ్‌ల తొలగింపులు, పీసీబీ ఛైర్మన్‌ల పునర్వ్యవస్థీకరణ వంటి నిర్ణయాలు నిరంతరంగా జరుగుతున్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్, అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీల్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కనబరిచింది. దీంతో క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు పీసీబీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటీవల షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే తప్పుడు నిర్ణయాల కారణంగానే పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంద”ని చెప్పారు. ఇక న్యూజిలాండ్‌తో జరిగే T20I సిరీస్‌లో పాకిస్థాన్ కొత్త కెప్టెన్‌గా సల్మాన్ అలీ ఆఘాను నియమించారు. అలాగే ODI జట్టు కెప్టెన్‌గా మహమ్మద్ రిజ్వాన్ కొనసాగనున్నాడు.