India tour of South Africa : మూడేళ్ల న‌ష్టాలు ఒక్క సిరీస్‌తో దూరం..! మ‌రో మూడేళ్ల వ‌ర‌కు ఢోకా లేదు..!

India tour of South Africa 2023-24 : భార‌త్‌తో సిరీస్ ఆడేందుకు దాదాపు అన్ని ఆదేశాలు ఆస‌క్తి చూపిస్తుంటాయి. ఎందుకంటే భార‌త్‌లోనే కాదు ఇత‌ర దేశాల్లో టీమ్ఇండియా మ్యాచ్ ఆడినా ఆ దేశాల బోర్డుల‌కు కాసుల కాసుల వ‌ర్షం కుర‌వ‌డమే ఇందుకు కారణం.

India tour of South Africa : మూడేళ్ల న‌ష్టాలు ఒక్క సిరీస్‌తో దూరం..! మ‌రో మూడేళ్ల వ‌ర‌కు ఢోకా లేదు..!

India tour of South Africa

మ‌న‌దేశంలో క్రికెట్‌ను ఓ ఆట‌లా కాదు ఓ మతంలా భావిస్తారు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు ఆఫీసులు, కాలేజీలు ఎగ్గొట్టి మ‌రీ చూసే వాళ్లు ఎంద‌రో. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ద్వారా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొన్ని వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆర్జిస్తోంది. ప్ర‌పంచ క్రికెట్‌లో అత్య‌ధిక సంప‌న్న బోర్డుగా బీసీసీఐ చ‌లామ‌ణీ అవుతోంది. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ల‌భించే ఆధాయంలో 1/3వ వంతు బీసీసీఐ నుంచే అందుతోంది అంటే అతిశ‌యోక్తి కాదేమో.

భార‌త్‌తో సిరీస్ ఆడేందుకు దాదాపు అన్ని ఆదేశాలు ఆస‌క్తి చూపిస్తుంటాయి. ఎందుకంటే భార‌త్‌లోనే కాదు ఇత‌ర దేశాల్లో టీమ్ఇండియా మ్యాచ్ ఆడినా ఆ దేశాల బోర్డుల‌కు కాసుల వ‌ర్షం కుర‌వ‌డమే ఇందుకు కారణం. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు ఆతిథ్య ద‌క్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడ‌నుంది. డిసెంబ‌ర్ 10న భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు డ‌ర్బ‌న్ వేదిక‌గా మొద‌టి టీ20 మ్యాచులో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచుతోనే టీమ్ఇండియా స‌ఫారీ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది.

Matthew Renshaw : ఒక్క బంతికే 7 ప‌రుగులు.. సిక్స్ కొట్ట‌లేదు.. ఇదేలా సాధ్యం.. వీడియో వైర‌ల్‌

భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టించ‌డం వ‌ల్ల ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు భారీగా ఆదాయం స‌మాకూర‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దాదాపు 28 రోజుల పాటు టీమ్ఇండియా ఆ దేశంలో ఉండ‌నుంది. టీమ్ఇండియా ఆడే మ్యాచుల ద్వారా ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మూడేళ్ల న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డ‌నుంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.

మూడేళ్లుగా న‌ష్టాల్లో స‌ఫారీ బోర్డు..

గ‌త కొన్నాళ్లుగా ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆర్థిక క‌ష్టాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోంది. గ‌త మూడేళ్లుగా ఆ దేశ బోర్డు వ‌రుస‌గా 6.3, 10.5, 11.7 మిలియ‌న్ డాల‌ర్ల చొప్పున న‌ష్టాల‌ను చ‌విచూసింది. మూడేళ్ల న‌ష్టాలు కాస్త ఒక్క భార‌త ప‌ర్య‌ట‌న ద్వారా పూడ‌నుంది. భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టించ‌డం వ‌ల్ల స‌ఫారీ బోర్డుకు 68.7 యూఎస్ మిలియ‌న్ల డాల‌ర్ల ఆదాయం ల‌భించ‌నుంద‌ట‌.

MS Dhoni : 20 కిలోల బ‌రువు త‌గ్గితే ఐపీఎల్‌లో తీసుకుంటాన‌న్న ధోని.. కానీ అతడు మాత్రం..

టికెట్ల అమ్మ‌కాలు, మీడియా హ‌క్కులు, స్పాన్స‌ర్లు ఇంకా అనేక మార్గాల్లో ఈ ఆదాయం అంద‌నుంద‌ట‌. అంటే భార‌త జ‌ట్టు ఆడే ఒక్కొ మ్యాచ్ ద్వారా 8.6 యూఎస్ మిలియ‌న్ డాల‌ర్ల ఆదాయం రానున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఇదే గ‌నుక నిజం అయితే మూడేళ్ల న‌ష్టాలు పూడ‌డంతో పాటు మ‌రో మూడేళ్ల పాటు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆర్థిక క‌ష్టాలు లేన‌ట్లేన‌ని అంటున్నారు.