ICC ODI Team Of The Year : భారత్‌కు ఐసీసీ షాక్.. 2024లో టీమ్ఇండియా తోపులు ఎవరూ లేరా?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2024 ఏడాదికి గానూ వన్డే జట్టును ప్రకటించింది.

ICC Announces ODI Team Of The Year 2024 no indian player in the list
భారత జట్టుకు ఐసీసీ షాకిచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2024 ఏడాదికి గానూ వన్డే జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఒక్కరంటే ఒక్క భారత ఆటగాడికి చోటు దక్కలేదు. ఐసీసీ ప్రకటించిన జట్టులో శ్రీలంక నుంచి నలుగురు, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి ముగ్గురేసి చొప్పున ఉండగా వెస్టిండీస్ నుంచి ఓ ఆటగాడికి చోటు దక్కింది. లంక ఆటగాడు చరిత్ అసలంక ‘2024 మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’ కు కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు.
వాస్తవానికి భారత జట్టు 2024 ఏడాదిలో ఎక్కువగా వన్డే మ్యాచులు ఆడలేదు. కేవలం మూడు అంటే మూడు వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా శ్రీలంకతోనే ఆడింది. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన తొలి సిరీస్ ఇదే. మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్ టైగా ముగియగా మిగిలిన రెండు మ్యాచుల్లో భారత్ ఓడిపోయింది. దీంతో 0-2 తేడాతో లంక జట్టుకు సిరీస్‌ను కోల్పోయింది.
గతేడాది టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ ఎక్కువగా వన్డేలు ఆడలేదు. వెస్టిండీస్, అమెరికా దేశాలు ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచి భారత్ రెండో సారి పొట్టి కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ గెలవగానే టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తో పాటు రవీంద్ర జడేజాలు పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశారు.
ఐసీసీ ప్రకటించిన 2024 మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ జట్టులో సేనా (SENA) దేశాలు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన ఆటగాళ్లకు చోటు దక్కలేదు. గతేడాది 16 వన్డేల్లో 50.2 సగటుతో చరిత్ అసంలక 605 పరుగులు చేశాడు. దీంతో అతడికి నాయకత్వ బాధ్యతలను అప్పగించింది.
2004 నుంచి ప్రతి ఏడాది ఐసీసీ వన్డే టీమ్‌లను ప్రకటిస్తూ వస్తోంది. ఈ జట్లలో కనీసం ఒక్క భారత ఆటగాడు లేకపోవడం ఇది రెండోసారి మాత్రమే. 2021లో ఐసీసీ మెన్స్ వన్డే టీమ్‌లోనూ భారత ఆటగాళ్లకు చోటు దక్కలేదు.
ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024..
చరిత్ అసలంక (కెప్టెన్)(శ్రీలంక), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గానిస్థాన్), పాతుమ్ నిస్సాంక(శ్రీలంక), కుసల్ మెండిస్ (వికెట్‌కీపర్) (శ్రీలంక), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్థాన్), హరీస్ రౌఫ్(పాకిస్థాన్), అల్లా ఘజన్‌ఫర్ (అఫ్గానిస్థాన్).
Presenting the ICC Men’s ODI Team of the Year 2024 featuring the finest players from around the world 👏 pic.twitter.com/ic4BSXlXCc
— ICC (@ICC) January 24, 2025