Womens World Cup : భారత మహిళా జట్టుకు భారీగా ఫ్రైజ్ మనీ.. మొత్తం ఎంత లభిస్తుందో తెలుసా..? 2023లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు కంటే అధికం..
Womens World Cup ఈ మెగా టోర్నమెంట్ మొత్తం బహుమతి 13.88 మిలియన్ డాలర్లు. ఇది న్యూజిలాండ్‌లో జరిగిన 2022 ఎడిషన్ కంటే 297శాతం ఎక్కువ.
Womens World Cup
ICC Womens World Cup 2025 Prize Money : నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాను ఓడించి మహిళల క్రికెటర్ ప్రపంచ కప్ 2025ను గెలుచుకోవడం ద్వారా భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టుకు భారీ ఫ్రైజ్ మనీ లభించింది. ఇది 2023 పురుషుల ప్రపంచ కప్ విజయంలో ఆస్ట్రేలియా సంపాదించిన దానికంటే ఎక్కువ కావడం గమనార్హం.
ఈ మెగా టోర్నమెంట్ మొత్తం బహుమతి 13.88 మిలియన్ డాలర్లు (రూ.122.49కోట్లు). ఇది న్యూజిలాండ్‌లో జరిగిన 2022 ఎడిషన్ కంటే 297శాతం ఎక్కువ. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
Also Read: Womens World Cup : మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే.. అప్పుడు కపిల్.. ఇప్పుడు అమన్.. వీడియో వైరల్
ప్రతి జట్టుకు గ్రూప్ దశలో ప్రతి విజయానికి 34.314 డాలర్లు (సుమారు రూ.30.28లక్షలు) మొత్తం కూడా అందించారు. అదే సమయంలో పాల్గొనే అన్ని జట్లకు 250,000 డాలర్లు (రూ.2.21కోట్లు) లభించనుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. ఈ క్రమంలో విజేతగా నిలిచిన భారత జట్టుకు ఎంత డబ్బులు లభించింది.. రన్నరప్ గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు ఎంత డబ్బులు వచ్చింది.. మిగిలిన జట్లకు ఎంత డబ్బులు లభించిందో ఇక్కడ తెలుసుకుందాం.
విజేత భారత జట్టుకు రూ.39.54కోట్లు ఫ్రైజ్ మనీ లభించింది. ఇక గ్రూప్ స్టేజ్‌లో మూడు విజయాలు సాధించినందుకు సమకూరిన డబ్బుతో మొత్తం కలిపి భారత జట్టుకు రూ.40.92కోట్లు లభించింది. రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టు రూ.19.76కోట్లు లభించాయి.. గ్రూప్ స్టేజ్ లో ఈ జట్టు ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది.. దీంతో దక్షిణాఫ్రికా జట్టుకు మొత్తం 21.63 కోట్లు లభించాయి. మూడో ప్లేస్ లో నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు ఫ్రైజ్ మనీ రూ.9.88 కోట్లు లభించింది. గ్రూప్ స్టేజ్ లో ఈ జట్టు మొత్తం ఆరు మ్యాచ్ లలో విజయం సాధించగా.. ఆ జట్టుకు టోర్నీ మొత్తంలో రూ. 13.97 కోట్లు అందుతుంది. అదేవిధంగా ఇంగ్లాండ్ జట్టుకు రూ.13.68కోట్లు, శ్రీలంక జట్టుకు రూ.8.73 కోట్లు, న్యూజిలాండ్ జట్టుకు రూ.8.73 కోట్లు, బంగ్లాదేశ్ జట్టుకు రూ. 5.01 కోట్లు లభించనుండగా.. ఈ టోర్నీలో చివరి స్థానంలో నిలిచిన పాకిస్థాన్ జట్టుకు రూ.4.70 కోట్లు లభించనున్నాయి.
విజేతలు, రన్నరప్ జట్లు అందుకున్న ఫ్రైజ్ మనీ.. 2023 పురుషుల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా, భారత జట్టు అందుకున్న దానికంటే చాలా ఎక్కువ. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆ జట్టుకు రూ.35.1 కోట్లు బహుమతిగా లభించింది. గ్రూప్ దశలో విజయానికి గాను రూ.35.15లక్షలు లభించాయి. అయితే, ప్రస్తుతం ఉమెన్స్ వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రైజ్ మనీ, గ్రూప్ స్టేజిలో మ్యాచ్ లకు కలిపి మొత్తం రూ.40.92 కోట్లు లభించనున్నాయి.
మరోవైపు.. వరల్డ్ కప్ విజేత భారత్ కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జగజ్జేత టీమిండియాకు రూ.51కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్ లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారని అన్నారు.
