India vs Australia Delhi Test: రసవత్తరంగా మారుతున్న ఇండియా, ఆసీస్ రెండో టెస్ట్.. కీలకంగా మారనున్న మూడోరోజు ఆట..

రెండో టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే, ఇరుజట్లకు మూడో రోజు ఆట కీలకం కానుంది. ఆదివారం ఆసీస్ బ్యాటర్లు భారత్ స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారనే అంశంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

India vs Australia Delhi Test: రసవత్తరంగా మారుతున్న ఇండియా, ఆసీస్ రెండో టెస్ట్.. కీలకంగా మారనున్న మూడోరోజు ఆట..

IND vs AUS 2nd Test Match

Updated On : February 19, 2023 / 8:27 AM IST

India vs Australia Delhi Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆసీస్ నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరుగుతుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా ఈ సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో రెండు రోజులు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ పైచేయి సాధించింది. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు 263 పరుగులు చేశారు. టీమిండియా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొని గౌరవప్రదమైన స్కోరు చేశారు. రెండోరోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు ఆసీస్ స్పిన్ బౌలింగ్ దాటికి ఇబ్బంది పడ్డారు. దీంతో తక్కువ స్కోర్ కే సగం వికెట్లు పడిపోయాయి. ముఖ్యంగా ఆసీస్ స్పిన్నర్ లైయన్ స్పిన్ మాయాజాలంకు టీమిండియా టాప్ ఆర్డర్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టింది.

India vs Australia 2nd Test Match: ముగిసిన రెండో రోజు ఆట.. 62 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా .. Live Updates

టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో రోహిత్ (32), కోహ్లీ (44) మినహా పెద్దగా ఎవరూ పరుగులు రాబట్టలేక పోయారు. చివరిలో అశ్విన్, అక్షర్ పటేల్ జోడీ మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అశ్విన్ 37 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ అద్భుత బ్యాటింగ్‌తో 74 పరుగులు చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 262 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ నిర్దేశించిన లక్ష్యానికి ఒక్క పరుగు వెనుబడింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. ఉస్మాన్ ఖవాజా (6) వికెట్ కోల్పోయినప్పటికీ.. హెడ్ (39), లబుషేన్ (16) క్రీజులో ఉన్నారు. దూకుడుగా ఆడుతూ రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి 61 పరుగులు చేశారు. దీంతో ఇండియాపై ఆసీస్ 62 పరుగుల ఆధిక్యంతో ఉంది.

 

 

రెండో టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే, ఇరుజట్లకు మూడో రోజు ఆట కీలకం కానుంది. ఆదివారం ఆసీస్ బ్యాటర్లు భారత్ స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారనే అంశంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో ఆసీస్ బ్యాటర్లకు టీమిండియా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవటం కొంచెం కష్టమైన పనే. స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టగలిగితే ఆసీస్ కు విజయావకాశాలు మెండుగా ఉంటాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. ఇక, మూడోరోజు ఆటలో ఆసీసీ బ్యాటర్లను తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టిస్తే.. టీమిండియా విజయం నల్లేరుపై నడకే అవుతుంది.