Jasprit Bumrah : మాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు అరవండి బాబులూ.. బుమ్రా సంబురాలు వైరల్
సామ్ చేసినట్లుగానే.. బుమ్రా సైతం అభిమాలను అరవాలంటూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు.

Jasprit Bumrah Epic Send Off To Sam Konstas in second innings
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. అసాధారణ పోరాటాలు, చిన్న చిన్న కవ్వింపులు ఇలా మొత్తంగా ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆసీస్ యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ కొంచెం అతి చేశాడు. ఇందుకు నాలుగో రోజు బుమ్రా గట్టి సమాధానమే చెప్పాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ చాలా దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు, ఫోర్లుతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ రోజు మీడియా సమావేశంలో ఆసీస్ మీడియా కాస్త అతి చేసింది. సామ్‌ను ఔట్ చేసే సత్తా బుమ్రాకు లేదని ఎద్దేవా చేసింది. ఇక భారత బ్యాటింగ్ సమయంలో మైదానంలోని ప్రేక్షకులను అరవాలంటూ సామ్ ఎంకరేజ్ చేశాడు. భారత ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకే అతడు ఇలా ప్రవర్తించాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ బుమ్రా బౌలింగ్‌లో సామ్ చితక్కొడతాడని ఆసీస్ ఫ్యాన్స్ భావించగా వారికి షాక్ తగిలింది. సీనియర్ పేస్ గుర్రం ఎదుట ఆసీస్ కుర్రాడు నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో ఓ అద్భుతమైన బంతితో బుమ్రా అతడిని క్లీన్ బౌల్డ్ చేశారు. అనంతరం సామ్ చేసినట్లుగానే.. బుమ్రా సైతం అభిమాలను అరవాలంటూ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బుమ్రా డబుల్ సెంచరీ..
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్లు (బంతుల పరంగా) తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా 8484 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
కపిల్ దేవ్ 50 టెస్టుల్లో 200 వికెట్లు తీస్తే బుమ్రా 44 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇక ఓవరాల్‌గా బంతుల పరంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. వకార్ యూనిస్(7,725 బంతులు), డేల్ స్టెయిన్(7,848), కగిసో రబడా(8,153)లు మాత్రమే బుమ్రా కన్నా ముందు ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. దీంతో ఆసీస్‌కు కీలకమైన 105 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 55 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. పాట్ కమిన్స్ (28), మార్నస్‌లబుషేన్ (70) లు క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 253 పరుగుల ఆధిక్యంలో ఉంది.
MIDDLE STUMP! Jasprit Bumrah gets Sam Konstas with a pearler. #AUSvIND | #DeliveredWithSpeed | @NBN_Australia pic.twitter.com/A1BzrcHJB8
— cricket.com.au (@cricketcomau) December 29, 2024