IND vs AUS 5th Test : బుమ్రాతో కొన్‌స్టాస్ వాగ్వాదం.. 2 బంతుల తరువాత.. నిరాశతో డగౌట్‌కు..
మరో రెండు బంతుల్లో తొలి రోజు ముగుస్తుందనగా హైడ్రామా చోటు చేసుకుంది.

IND vs AUS 5th Test Sam Konstas gets into heated altercation with Jasprit Bumrah
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ 72.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. అయితే.. మరో రెండు బంతుల్లో తొలి రోజు ముగుస్తుందనగా హైడ్రామా చోటు చేసుకుంది.
బుమ్రా బాల్ వేసేందుకు సిద్ధం అవ్వగా స్ట్రైకింగ్ చేస్తున్న ఉస్మాన్ ఖవాజా మధ్యలో ఆగిపోయాడు. మళ్లీ సిద్ధం అయి బౌలింగ్ చేయి అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో బుమ్రా కాస్త అసహనాన్ని వ్యక్తం చేశాడు. తిరిగి బౌలింగ్ చేసేందుకు వెలుతుండగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న యువ ఆటగాడు కొన్‌స్టాస్ ఏదో అన్నాడు. దీంతో బుమ్రా అతడికి గట్టి సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఇరు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వెంటనే అంపైర్లు, ఖవాజా కలుగజేసుకుని ఇద్దరికి సర్దిచెప్పారు.
AUS vs IND : సిడ్నీ టెస్టు.. తొలిరోజు ఆస్ట్రేలియాదే పైచేయి.. చివరిలో దిమ్మతిరిగే షాకిచ్చిన బుమ్రా
బుమ్రా బాల్ వేయగా పరుగులు ఏమీ రాలేదు. ఆ తరువాత బంతి (తొలి రోజు ఆఖరి బాల్)కి ఖవాజా స్లిప్‌లో క్యాచ్ ఇవ్వగా రాహుల్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటూ యువ ఆటగాడు కొన్‌స్టాస్ వైపుకు దూసుకువచ్చాడు. ఇక అతడు చేసేది ఏమీ లేక ఇదేమీ పట్టించుకోకుండా డగౌట్ వైపుకు నడుచుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొన్‌స్టాస్‌ను ఉద్దేశించి చిన్నా నీకిది అవసరమా చెప్పు అని ఫన్నీగా అంటున్నారు.
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 2-1తో వెనుకబడి ఉంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలన్నా, సిరీస్‌ను డ్రాగా ముగించాలి అన్నా కూడా ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం ఎంతో ముఖ్యం. ఈ కీలక మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కు విశ్రాంతి ఇచ్చారు. జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. కాగా.. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా నాయకత్వంలోనే భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Fiery scenes in the final over at the SCG!
How’s that for a finish to Day One 👀#AUSvIND pic.twitter.com/BAAjrFKvnQ
— cricket.com.au (@cricketcomau) January 3, 2025