IND vs BAN : రోహిత్ శర్మ వల్ల హ్యాట్రిక్ మిస్.. స్పందించిన అక్షర్ పటేల్.. సెలబ్రేట్ చేసుకున్నా.. కానీ..
రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేయడం పై అక్షర్ పటేల్ స్పందించాడు.

IND vs BAN Axar Patel respond over Rohit Sharma drops easy catch
ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించే సువర్ణావకాశం కోల్పోయాడు అక్షర్ పటేల్. అది కూడా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వల్లనే కావడం గమనార్హం. తాను చేసిన పొరపాటుకు హిట్‌మ్యాన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. బౌలర్ అక్షర్ పటేల్‌కు సారీ చెప్పాడు. ఇక తన బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేయడం పై అక్షర్ స్పందించాడు.
అసలేం జరిగిందంటే..?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌లు దుబాయ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ను స్పిన్నర్ అక్షర్ పటేల్ వేశాడు. రెండో బంతికి ఓపెనర్ తాంజిద్ హసన్ (25) ను ఔట్ చేశాడు. ఈ తరువాత క్రీజులో అడుగుపెట్టిన సీనియర్ బ్యాటర్ ముష్ఫీకర్ రహీమ్ (0)ను సైతం పెవిలియన్‌కు చేర్చాడు. వీరిద్దరి క్యాచ్‌లను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పట్టాడు. ఈ సమయంలో జాకీర్ అలీ క్రీజులోకి వచ్చాడు. తొలి బంతికే అతడు ఆడిన బాల్ స్లిప్ వైపుగా వెళ్లింది.
అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ సైతం బంతిని అందుకున్నట్లే కనిపించాడు. అయితే.. ఆఖరి క్షణంలో బంతి అతడి చేతి నుంచి జారీ పోయింది. దీంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్ అయింది.
స్పందించిన అక్షర్ పటేల్..
తన హ్యాట్రిక్ మిస్ కావడం, రోహిత్ శర్మ క్యాచ్ వదిలిపెట్టడం పై అక్షర్ పటేల్ స్పందించాడు. ఇన్నింగ్స్ విరామ సమయంలో మాట్లాడుతూ.. క్యాచ్‌లు మిస్ కావడం అనేది ఆటలో ఓ భాగం అని చెప్పాడు. ఆ సమయంలో రోహిత్ బంతిని అందుకున్నట్లుగా కనిపించడంతో తాను హ్యాట్రిక్ సాధించినట్లుగా భావించి సెలబ్రేషన్ చేసుకున్నానని చెప్పాడు. ఆ తరువాత హిట్‌మ్యాన్ ని చూసే సరికి అతడు క్యాచ్ అందుకోలేదన్నాడు.
దీంతో తన హ్యాట్రిక్ మిస్సైందని చెప్పాడు. ఆ సమయంలో తానేమీ పెద్దగా రియాక్ట్ కాలేదని, తిరిగి బౌలింగ్ చేసేందుకు సిద్ధం అయినట్లుగా అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించడమే తన పని అని చెప్పాడు. జట్టు తనను నమ్ముతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.