IND vs ENG : దంచికొట్టిన భార‌త బ్యాటర్లు.. ఇంగ్లాండ్ ముందు భారీ ల‌క్ష్యం..

అహ్మ‌దాబాద్ వ‌న్డేలో భార‌త బ్యాట‌ర్లు దంచికొట్ట‌డంతో ఇంగ్లాండ్ ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది.

IND vs ENG : దంచికొట్టిన భార‌త బ్యాటర్లు.. ఇంగ్లాండ్ ముందు భారీ ల‌క్ష్యం..

Updated On : February 12, 2025 / 8:32 PM IST

అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట‌ర్లు దంచికొట్టారు. దీంతో ఇంగ్లాండ్ ముందు 357 ప‌రుగుల భారీ ల‌క్ష్యం నిలిచింది. ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (112; 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 356 ప‌రుగులకు ఆలౌటైంది.

భార‌త బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (78; 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లీ (52; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీలు బాదారు. కేఎల్ రాహుల్ (40; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీశాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సాకిబ్ మ‌హ‌మూద్‌, గుస్ అట్కిన్సన్, జో రూట్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

Virat Kohli- Adil Rashid : వార్నీ కోహ్లీ వికెట్ తీయ‌డం అంటే ఇష్ట‌మా ఆదిల్ ర‌షీద్ నీకు.. అత్య‌ధిక సార్లు ఔట్ చేసిన బౌల‌ర్‌గా..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం ద‌క్క‌లేదు. గ‌త మ్యాచ్‌లో సెంచ‌రీతో ఫామ్‌లోకి వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ (1) నిరాశ‌ప‌రిచాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అందుకోవ‌డంతో జ‌ట్టు స్కోరు 6 వ‌ద్ద హిట్‌మ్యాన్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. అయితే.. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన విరాట్ కోహ్లీ చాన్నాళ్ల త‌రువాత సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఎట్ట‌కేల‌కు అత‌డు ఫామ్ అందుకున్నాడు. 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ‌శ‌త‌కం బాదిన కాసేప‌టికే ఔట్ అయ్యాడు.

మ‌రోవైపు ఫామ్‌లో ఉన్న శుభ్‌మ‌న్ గిల్ త‌న‌దైన శైలిలో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. ఈ క్ర‌మంలో హాఫ్ సెంచ‌రీ అందుకున్నాడు. కోహ్లీతో క‌లిసి రెండో వికెట్‌కు 116 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. కోహ్లీ ఔటైనా స‌రే శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో క‌లిసి దూకుడుగా ఆడుతూ 95 బంతుల్లోనే మూడు అంకెల స్కోర్ అందుకున్నాడు. అయ్య‌ర్‌తో క‌లిసి మూడో వికెట్ కు 104 ప‌రుగులు జోడించిన త‌రువాత గిల్ ఔట్ అయ్యాడు.

IND vs ENG : చ‌రిత్ర సృష్టించిన శుభ్‌మ‌న్ గిల్‌.. హ‌షీమ్ ఆమ్లా, వివియన్ రిచర్డ్స్ రికార్డులు బ్రేక్‌.. వ‌న్డేల్లో ఫాసెస్ట్ 2500 ర‌న్స్‌..

గిల్ ఔటైనా స‌రే శ్రేయ‌స్ అయ్య‌ర్ ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌పై క‌నిక‌రం చూప‌లేదు. దంచికొట్టే బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. అత‌డికి కేఎల్ రాహుల్ జ‌త క‌లిశాడు. వీరిద్ద‌రు దంచికొట్ట‌డంతో స్కోరు బోర్డు ప‌రుగులు పెట్టింది. సెంచ‌రీకి చేరువైన అయ్య‌ర్‌ను ఆదిల్ ర‌షీద్ ఔట్ చేశాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ బౌల‌ర్లు విజృంభించారు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో హార్దిక్ పాండ్యా (17), అక్ష‌ర్ ప‌టేల్ (13)ల‌తో పాటు కేఎల్ రాహుల్‌లు ఔట్ అయ్యారు. ఆ త‌రువాత భార‌త ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు ప‌ట్ట‌లేదు.