Virat Kohli : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్.. సచిన్ ఆల్‌టైమ్ ఫీట్‌తో సహా నాలుగు రికార్డులపై విరాట్ కోహ్లీ కన్ను..
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ లో కోహ్లీ ఓ నాలుగు రికార్డులను అందుకునే అవకాశం ఉంది. ఆ రికార్డులు ఏంటంటే..

IND vs ENG Virat Kohli can break Sachin Tendulkar all time feat in ODI series
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేసే పనిలో ఉన్నాడు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో సచిన్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టేస్తున్నాడు. ఇప్పటికే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇక ప్రస్తుతం వన్డేల్లో సచిన్ పరుగుల రికార్డును అందుకునే పనిలో ఉన్నాడు.
గురువారం నుంచి ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌లో సచిన్ కు సంబంధించిన ఓ రికార్డుతో సహా మరికొన్ని రికార్డులను అందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అవి ఏమిటో చూద్దాం..
అత్యంత వేగంగా 14 వేల మైలురాయి..
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 283 ఇన్నింగ్స్‌ల్లో 58.18 సగటు 93.54 స్ట్రైక్ రేటుతో 13,906 పరుగులు సాధించాడు. ఇందులో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో కోహ్లీ మరో 94 పరుగులు చేస్తే 14 వేల మైలురాయిని చేరుకుంటారు. అంతేకాదండోయ్ ఈ మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు. 14 వేల పరుగుల మైలురాయిని సచిన్ 350వ ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఆడనుండడంతో ఈ రికార్డును విరాట్ అవలీల అందుకోనున్నాడు.
IND vs ENG : వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్..!
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా..
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ వన్డే క్రికెట్‌లో 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత శ్రీలంక దిగ్గజ ఆటగాడు 14,234 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఇక కోహ్లీ 13,906 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో కోహ్లీ మరో 329 పరుగులు చేస్తే కుమార సంగక్కర దాటి వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.
వన్డేల్లో స్వదేశంలో అత్యధిక 50+స్కోర్లు..
వన్డేల్లో స్వదేశంలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీ మరో రెండు 50+ స్కోర్లు అవసరం. వన్డేల్లో స్వదేశంలో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా ప్రస్తుతం సచిన్ ఉన్నాడు. సచిన్ 58 (38 హాఫ్ సెంచరీలు, 20 సెంచరీలు) సార్లు 50+ స్కోర్లను సాధించాడు. కోహ్లీ 57 (33 హాఫ్ సెంచరీలు, 24 సెంచరీలు) సార్లు 50+ స్కోర్లను అందుకున్నాడు.
ఇంగ్లాండ్ పై వన్డేల్లో అత్యధిక పరుగులు..
వన్డేల్లో ఇంగ్లాండ్ పై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 36 ఇన్నింగ్స్‌ల్లో 41.87 సగటుతో 1340 పరుగులు చేశాడు. అతడు మరో 293 చేస్తే ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు క్రిస్‌గేల్ పేరిట ఉంది. గేల్ ఇంగ్లాండ్ పై 1632 పరుగులు చేశాడు.