IND vs NZ : రెండో వన్డేలో భారత్ ఓటమి.. కెప్టెన్ గిల్ తీసుకున్న ఆ నిర్ణయమే కొంపముంచిందా..! రాహుల్ సెంచరీ వృథా

IND vs NZ 2nd ODI : టీమిండియా ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అతిపెద్ద కారణంగా పేలవమైన బ్యాటింగ్. మరో ప్రధాన కారణం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న నిర్ణయం కూడా ఓ కారణంగా పలువురు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

IND vs NZ : రెండో వన్డేలో భారత్ ఓటమి.. కెప్టెన్ గిల్ తీసుకున్న ఆ నిర్ణయమే కొంపముంచిందా..! రాహుల్ సెంచరీ వృథా

IND vs NZ 2nd ODI

Updated On : January 15, 2026 / 7:25 AM IST
  • రెండో వన్డేలో కివీస్ చేతిలో భారత్ ఓటమి
  • కేఎల్ రాహుల్ సెంచరీ వృథా
  • సెంచరీతో కివీస్ జట్టును విజయతీరాలకు చేర్చిన మిచెల్
  • కెప్టెన్ గిల్ తీసుకున్న ఆ నిర్ణయమే కొంపముంచిందా!

IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం రాత్రి రాజ్‌కోట్‌లో రెండో వన్డే జరిగింది. ఈ వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఈనెల 18వ తేదీన జరగనుంది.

Also Read : Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ పై వ‌న్డేల్లో ఒకే ఒక భార‌తీయుడు..

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 284 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (56) రాణించగా.. కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. కోహ్లీ, రోహిత్ సహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. అయితే, భారీ లక్ష్యంతో బరిలోకిదిగిన న్యూజిలాండ్ జట్టు 47.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 286 పురుగులు చేసింది. విల్ యంగ్ (87) రాణించగా.. మిచెల్ (131 నాటౌట్) సెంచరీతో న్యూజిలాండ్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో ఏడు వికెట్ల తేడాతో టీమిండియాపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది.

అయితే, టీమిండియా ఓటమికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అతిపెద్ద కారణంగా పేలవమైన బ్యాటింగ్. వికెట్ కోల్పోకుండా 70 పరుగులు చేయడం నుంచి భారత జట్టు 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంటే 48 పరుగులలోపే ఈ నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ పై పట్టు సాధించేందుకు అవకాశం లభించింది. సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఒకానొక సమయంలో టీమిండియా 250 పరుగులు చేయడం కూడా కష్టంగా అనిపించింది. కానీ, కేఎల్ రాహుల్ (112నాటౌట్) అద్భుత సెంచరీతో భారత జట్టు స్కోర్ ను 284 పరుగులకు చేర్చాడు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయం కూడా టీమిండియా ఓటమిలో ప్రధాన కారణంగా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్లో ప్రసిద్ కృష్ణ హెన్రీ నికోల్స్ వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత ఓవర్లోనే కెప్టెన్ మహమ్మద్ సిరాజ్ లేదా హర్షిత్ రాణా వంటి వికెట్ తీసే బౌలర్ల వైపు మొగ్గుచూపి కివీస్ పై ఒత్తిడి పెంచాల్సింది. కానీ, నితీశ్ రెడ్డితో కెప్టెన్ బౌలింగ్ చేయించడం ఆశ్చర్యానికి గురిచేసింది. గిల్ తీసుకున్న ఈ నిర్ణయం కొంతవరకు డారిల్ మిచెట్, విల్ యంగ్ క్రీజులో స్థిరపడటానికి సహాయపడిందన్న వాదన ఉంది. సాధారణంగా వరుసగా వికెట్లు పడినప్పుడు క్రీజులోకి వచ్చిన బ్యాటర్ చాలా జాగ్రత్తగా ఆడతాడు. కానీ, 14ఓవర్లో మిచెల్, విల్ యంగ్ నితీశ్ రెడ్డి బౌలింగ్ లో స్వేచ్ఛగా ఆడారు. దీంతో వారు ఒత్తిడి నుంచి దూరమయ్యారు.

ఈ మ్యాచ్‌లో భారత స్పిన్ బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు. కుల్దీప్ యాదవ్ ప్రారంభం నుండి చివరి వరకు అంటే 10 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా అనుభవం కూడా సహాయపడలేదు. అతను 8 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో 80 పరుగుల వద్ద మిచెల్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద ప్రసిధ్‌ వదిలేయడం కూడా కివీస్ జట్టుకు కలిసొచ్చింది.