IND vs SA : 0, 1, 13, 2 .. అయ్యో.. ఇలా ఆడుతున్నారేంటి..! టీమిండియాకు షాక్‌ల మీద షాక్‌లు..
IND vs SA : టీమిండియా విజయానికి స్వల్ప పరుగులే అవసరం కాగా.. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోకుంటే ఓటమి తప్పదు.
IND vs SA
IND vs SA : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఈడెన్ గార్డె్న్స్ లో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. మూడోరోజు (ఆదివారం) ఆటలో టీమిండియా తడబాటుకు గురైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. గెలిచేందుకు తక్కువ పరుగులే అవసరం ఉన్నా.. వెంటవెంటనే వికెట్లు కోల్పోతుండటంతో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. తొలి రోజు భారత బౌలర్లు విజృంబించడంతో తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు సైతం తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు కేవలం 189 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. మూడో రోజు (ఆదివారం) ఆలౌట్ అయింది. కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు కెప్టెన్ తెంబా బావుమా (55) మినహా మిగిలిన బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు.
124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ప్రారంభంలోనే షాక్ మీద షాక్ లు తగిలాయి. నలుగురు బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. జైస్వాల్ (0) పరుగులేమీ చేయకుండానే డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ధ్రువ్ జురెల్ కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకున్నప్పటికీ 13 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. కానీ, సైమన్ హార్మర్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 13 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం రెండు పరులు మాత్రమే చేయగలిగాడు.
టీమిండియా విజయానికి స్వల్ప పరుగులే అవసరం కాగా.. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోకుంటే ఓటమి తప్పదు. దీంతో సౌతాఫ్రికా బౌలర్ల దూకుడును అడ్డుకొని భారత బ్యాటర్లు ఏమేరకు రాణిస్తారు.. టీమిండియా విజయం సాధిస్తుందా.. అనేది తేలాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
