India Vs Pakistan : ఆసియా కప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్.. పాకిస్తా‌న్‌పై భారత్‌దే పైచేయి.. రికార్డులు ఇవే..

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ కిక్కే వేరు. ఫార్మాట్ ఏదైనా.. ఇరు దేశాలు తలపడుతున్నాయంటే.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. క్రికెట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తొలిసారిగా హోరాహోరిగా తలపడనున్నాయి.

India Vs Pakistan : ఆసియా కప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్.. పాకిస్తా‌న్‌పై భారత్‌దే పైచేయి.. రికార్డులు ఇవే..

Updated On : August 28, 2022 / 9:49 PM IST

India Vs Pakistan : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ కిక్కే వేరు. ఫార్మాట్ ఏదైనా.. ఇరు దేశాలు తలపడుతున్నాయంటే.. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ. క్రికెట్ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ లు ఆసియా కప్ వేదికగా తొలిసారిగా హోరాహోరిగా తలపడనున్నాయి. చాలా రోజుల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఊపిరిబిగపట్టుకుని ఎదురుచూస్తున్నారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ హైఓల్టేజ్ మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తుందని హైఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. గత మ్యాచ్ లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసి భారత ప్లేయర్లలో కనిపిస్తోంది. మరోవైపు గత మ్యాచ్ విజయపరంపరను కొనసాగించాలని భావిస్తోంది పాకిస్తాన్.

ఆసియా కప్ లో పాక్ పై భారత్ దే పైచేయి..
కాగా, ఆసియా కప్ లో పాకిస్తాన్ పై భారత్ దే పైచేయి. ఆసియా కప్ లో ఇరు జట్లు 14సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ దే ఆధిపత్యం. 8 మ్యాచులు టీమిండియా నెగ్గితే, పాకిస్తాన్ ఆరు సార్లు నెగ్గింది. ముఖ్యంగా పాక్ తో జరిగిన చివరి మూడు మ్యాచుల్లో భారత్ దే విజయం. 2016 ఫిబ్రవరి 27న మీర్పూర్ లో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. 2018 సెప్టెంబర్ 19న జరిగిన ఆసియా కప్ తొలి మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో, అదే నెల 22న జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో పాక్ జట్టును మట్టికరిపించింది టీమిండియా.

Pakistan Cricketer Shadab Khan: కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేసిన పాక్ క్రికెటర్.. సెంచరీ చేయాలంటూనే పాక్‌పై అంతసీన్ లేదంటూ వ్యాఖ్య

ఉత్కంఠపోరులో పాక్ గెలుపు..
ఆసియా కప్ లో ఇరు జట్ల నడుమ జరిగిన ఉత్కంఠ మ్యాచ్ ల విషయానికి వస్తే 2014లో మార్చి 2న జరిగిన మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో పాకిస్తాన్ గెలిచింది. భారత స్పిన్నర్ అశ్విన్ వేసిన చివరి ఓవర్ లో షాహిద్ అఫ్రిది సిక్సులు దంచికొట్టడంతో పాక్ చెమటోడ్చి విజయం సాధించింది.

83 పరుగులకే పాక్ ఆలౌట్..
ఇక అత్యల్ప స్కోర్ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ చేతిలో పాకిస్తాన్ 17.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 2016 ఫిబ్రవరి 27న జరిగిన ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్ లు సమయోచితంగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. అయితే ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్య రహానెలు డకౌట్ అయ్యారు. టీ20 ఇంటర్నేషనల్ లో ఓ మ్యాచ్ లో భారత ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయిన ఏకైక చెత్త రికార్డ్ ను మూటకట్టుకున్నారు ఆ సమయంలో.

రెండుసార్లు 300 ప్లస్ స్కోర్ చేసిన పాక్..
ఆసియా కప్ లో అత్యధిక స్కోర్ విషయానికి వస్తే ఇప్పటివరకు భారత్ పై పాకిస్తాన్ 300 ప్లస్ స్కోర్ మూడు సార్లు చేసింది. 2022 మార్చి 18న మీర్పూర్ లో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్లకు 329 పరుగులు చేసింది పాకిస్తాన్. ఇదే వారి అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు పాక్ బౌలర్లను ఉతికారేయడంతో 4 వికెట్లు కోల్పోయి టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆసియా కప్ ల్ భారత్ కు పాక్ పై ఇదే అత్యధిక చేధన కావడం విశేషం.

Ind Vs Pak Match: హైవోల్టేజ్ మ్యాచ్.. నేడు దాయాది జట్ల మధ్య సమరం.. వారు రాణిస్తే భారత్ విజయం నల్లేరుపై నడకే.

పాక్ ఓపెనర్లు సెంచరీలు..
ఆసియా కప్ లో ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు నమోదు చేశారు. 2012 మార్చి 18న జరిగిన మ్యాచ్ లో పాక్ ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ 105 పరుగులు, నాసిర్ జంషేడ్ 112 పరుగులు చేశారు. ఆసియా కప్ లో భారత్ పై పాకిస్తాన్ ఓపెనర్ల అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఈ మ్యాచ్ లో తొలి వికెట్ కు 224 పరుగులు చేశారు పాక్ ఓపెనర్లు. ఆసియా కప్ లో ఏ వికెట్ కైనా ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

రెండు సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ కోహ్లి..
ఇక భారత్ వైపు నుంచి చూస్తే ఛేజింగ్ లో రెండు సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్ గా విరాట్ కోహ్లి నిలిచాడు. 2012 మార్చి 18న మీర్పూర్ లో పాక్ పై జరిగిన మ్యాచ్ లో 183 పరుగులు, 2014 ఫిబ్రవరి 26న బంగ్లాదేశ్ తో ఫతుల్లాలో జరిగిన పోరులో 136 పరుగులు చేశాడు కోహ్లి. తన కెరీర్ లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి పాక్ పైనే అత్యధిక స్కోర్ 183 రన్స్ సాధించాడు. అంతేకాకుండా ఆసియా కప్ లో ఏ బ్యాటర్ కైనా ఇదే వ్యక్తిగత అత్యధిక స్కోర్ కావటం విశేషం.

సెంచరీలతో కదం తొక్కిన భారత ఓపెనర్లు..
ఆసియా కప్ లో భారత ఓపెనర్ల అత్యుత్తమ ప్రదర్శన విషయానికి వస్తే 2018 సెప్టెంబర్ 23న పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు తొలి వికెట్ కు 210 రన్స్ జోడించారు. ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న భారత ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు బాదారు. పాక్ బౌలర్లను ఉతికారేసిన భారత ఓపెనర్లు ధావన్ 114 పరుగులు, రోహిత్ శర్మ 111 పరుగులు చేశారు.

Virat Kohli 100th T20 Match : పాక్‌తో తన వందో టి-20 మ్యాచ్‌ ఆడనున్న విరాట్‌ కోహ్లీ..సూపర్‌ ఫామ్‌ అందుకునేందుకు కసరత్తు

పాక్ నడ్డివిరిచిన అర్షద్ అయూబ్..
ఆసియా కప్ లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను 1988 అక్టోబర్ 31న నమోదు చేశారు భారత బౌలర్ అర్షద్ అయూబ్. డాకాలో జరిగిన ఈ మ్యాచ్ లో 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచాడు అయూబ్. ఆసియా కప్ లో భారత్ తరపున ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. పాక్ వైపు చూస్తే 1995 ఏప్రిల్ 7న భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఆకిబ్ జావెద్ 19 పరుగులకే 5 వికెట్లు తీశాడు. ఆసియా కప్ లో భారత్ పై ఓ పాక్ బౌలర్ కు 5 వికెట్ల ప్రదర్శన కూడా ఇదే అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇప్పటివరకు మరే బౌలర్ కూడా ఏ మ్యాచ్ లోనూ 5 వికెట్లు తీయలేకపోయారు. షార్జాలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ కు పరుగుల పరంగా కూడా ఇదే అతిపెద్ద విజయం.

పాక్ తో మ్యాచ్ అంటే పూనకం వచ్చినట్టు చెలరేగుతాడు..
ఆసియా కప్ లో పాక్ తో మ్యాచ్ అనగానే పూనకం వచ్చినట్లు చెలరేగుతాడు భారత బ్యాటర్ రోహిత్ శర్మ. కేవలం 8 ఇన్నింగ్స్ లో 61.16 సగటుతో 367 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 92.44. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై మరే బ్యాటర్ కు కూడా ఇలాంటి రికార్డ్ లేదు.

ఒక్క సిక్స్ కూడా నమోదు కాలేదు…
క్రికెట్ లో సిక్సులు అనగానే ప్రేక్షకులకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. భారత్ పాక్ మ్యాచ్ అంటే మరీనూ. అయితే ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో సింగిల్ సిక్స్ కూడా నమోదు కాని మ్యాచులు రెండున్నాయి. నమ్మలేకున్నా ఇది నిజం. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 1988 అక్టోబర్ 31న డాకాలో జరిగిన మ్యాచ్ లో, అలాగే 2016 ఫిబ్రవరి 27న మీర్పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత్, పాక్ వైపు నుంచి ఏ బ్యాటర్ కూడా ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు.