India vs Pakistan: భారత్-పాక్ మ్యాచ్.. అప్పట్లో మైదానంలో ఇలా గొడవపడ్డ క్రికెటర్లు.. ప్రేక్షకులు ఒకటే అరుపులు
గతంలో వన్డే మ్యాచుల్లో భారత్ – పాకిస్థాన్ తలబడినప్పుడు పలుసార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

India vs Pakistan
India vs Pakistan – ODI History: భారత్ – పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. శనివారం ఇరు దేశాల జట్లు ఆసియా కప్ (Asia Cup 2023)లో తలపడుతున్నాయి. ఈ ఇరు జట్లే టోర్నీలో ఫేవరెట్‌గా ఉన్నాయి. ఆసియా కప్ వన్డే ఫార్మాట్లో జరుగుతోంది. గతంలో వన్డే మ్యాచుల్లో భారత్ – పాకిస్థాన్ తలబడినప్పుడు పలుసార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
కిరణ్ మోర్‌ను అనుకరించిన జావేద్ మియాందాద్
క్రికెట్ ప్రపంచ కప్-1992లో భారత్-పాక్ తలపడుతున్న సమయంలో గొడవ జరిగింది. పాకిస్థాన్ బ్యాటర్ జావెద్ మియాందాద్ ఔట్ అంటూ భారత వికెట్ కీపర్ కిరణ్ మోర్ గట్టిగా అప్పీల్ చేశాడు. ఆ సమయంలో చిరాకుతో కిరణ్ మోర్‌ను అనుకరిస్తూ మైదానంలో ఫన్నీగా జంప్స్ చేశాడు.
వెంకటేశ్ ప్రసాద్, అమీర్ సోహైల్ మధ్య గొడవ
వన్డే ప్రపంచ కప్-1996 క్వార్టర్ ఫైనల్లో భారత్-పాక్ ఆడుతున్న సమయంలో గొడవ చెలరేగింది. పాకిస్థాన్ ఓపెనర్ అమీర్ సోహైల్ బాగా రాణిస్తున్నాడు. పాక్ స్కోరు 113/1గా ఉన్న సమయంలో ప్రసాద్ బౌలింగ్ లో సోహైల్ ఆఫ్ సైడ్ లో ఫోర్ బాదాడు. మరో ఫోరు బాదుతానంటూ ప్రసాద్ కి సైగ చేసి, బౌండరీ వైపు చూపెడుతూ చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆ తదుపరి బంతికే అమీర్ సోహైల్ ఔటయ్యాడు. దీంతో సోహైల్ కు పెవిలియన్ వైపు దారి చూపాడు.
గంభీర్, అఫ్రిదీ మధ్య..
పాకిస్థాన్ తో 2007లో వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ, భారత ప్లేయర్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. మైదానంలో పరుగులు తీస్తున్న వేళ అఫ్రిదీ ఉద్దేశపూర్వకంగా అడ్డు వచ్చాడని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరువురు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
గంభీర్, అక్మల్ మధ్య..
ఆసియా కప్-2010లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. గౌతం గంభీర్ బ్యాటింగ్ చేస్తుండగా పాక్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ కీపింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో గంభీర్ ఔట్ అంటూ గట్టిగా అప్పీల్ ఇచ్చి అక్మల్ చిరాకు తెప్పించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. అంపైర్లు, తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
రెచ్చిపోయిన హర్భజన్, అఖ్తర్
ఆసియా కప్-2010లోనే భారత ప్లేయర్ హర్భజన్ సింగ్, పాక్ ఆటగాడు షోయబ్ అఖ్తర్ మధ్య ఘర్షణ చెలరేగింది. చివరి ఓవర్లలో ఉత్కంఠ నెలకొన్న వేళ వారిద్దరు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. అఖ్తర్ బౌలింగ్ లో హర్భజన్ సింగ్ సిక్స్ కొట్టగానే, మైదానంలో ఒకరినొకరు తిట్టుకున్నారు. అనంతరం అమీర్ బౌలింగ్ లో హర్భజన్ మరో సిక్సర్ కొట్టి టీమిండియాను గెలిపించాడు. అనంతరం మళ్లీ అఖ్తర్ వైపు చూస్తూ హర్భజన్ గంతులేశాడు.
Asia Cup 2023 : పాక్‌తో మ్యాచ్.. రోహిత్ ఆ ముగ్గురితో జాగ్రత్త.. ముఖ్యంగా షాహిన్‌తో..!