అప్పుడు లంకపైనా.. ఇప్పుడు బంగ్లాతోనూ..

అప్పుడు లంకపైనా.. ఇప్పుడు బంగ్లాతోనూ..

Updated On : November 24, 2019 / 9:59 AM IST

బంగ్లాదేశ్‌తో పింక్‌ బాల్‌ టెస్టుకు ముందు టీమిండియా పేసర్లు అసలు బౌలింగ్‌ ఎలా వేస్తారనే సందేహాలు తలెత్తాయి. ఎర్రబంతితో రాణిస్తున్న పేసర్లు గులాబీ బంతిపై పట్టు సాధిస్తారా అనే చర్చ జరిగింది. తమకు ఏ బంతైనా ఒక్కటే చెలరేగిపోయారు టీమిండియా పేసర్లు. ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీలు నిప్పులు చెరిగే బంతులతో బంగ్లాకు ముచ్చెమటలు పట్టించారు. 

రెండు ఇన్నింగ్స్‌లోనూ భారత పేసర్లే 19 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ప్లేయర్ మొహ్మదుల్లా రిటైర్డ్‌ ఔట్‌గా వెళ్లిపోవడంతో పేసర్ల ఖాతాలో 19 వికెట్లే చేరాయి. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఇషాంత్‌ శర్మ మొత్తం 9 వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ 8 వికెట్లు దక్కించుకున్నాడు. మహ్మద్‌ షమీకి రెండు వికెట్లు లభించాయి. దీంతో స్పిన్నర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. 

భారత్ సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌లలో టెస్టు మ్యాచ్‌ల పరంగా ఏ ఒక్క టెస్టులోనూ భారత స్పిన్నర్లు వికెట్‌ కూడా సాధించకపోవడం ఇదే రెండోసారి. గతంలో శ్రీలంకతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్టులోనూ పేసర్లే మొత్తం వికెట్లను పడగొట్టారు. 2017-18 సీజన్‌లో జరిగిన అప్పటి టెస్టులో భారత పేసర్లే 17 వికెట్లను సాధించారు. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో స్పిన్నర్లకు మాత్రమే వికెట్లు దక్కాయి. ఆ నాటి మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ స్థానంలో భువనేశ్వర్ ఉండగా మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌‌లు కలిసి మొత్తం వికెట్లు పడగొట్టారు.