ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత జట్టు ఇదేనా..?

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసింది. మరోవైపు వరల్డ్ కప్ 2019లో ఆడేందుకు కొద్ది నెలల దూరమే ఉంది. ప్రపంచ కప్ ఆడటానికి ముందు భారత జట్టు ఆడనున్న ఆఖరి పోరాటం ఇదే. సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో సెలక్టర్లు భారత జట్టులో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఉత్కంఠగా మారింది. రొటేషన్ పద్ధతిలో ఆటగాళ్లకు విరామమిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్ 15మందితో కూడిన జట్టును ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది.
న్యూజిలాండ్‌తో సిరీస్ జరుగుతుండగానే విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు ఈ సారి రోహిత్ శర్మ, మొహ్మద్ షమీ, భువనేశ్వర్‌లకు విరామం కల్పించనున్నారట. అలా అయితే ఆ మిగిలిసన స్థానాల్లో ఎవరు ఆడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ మరో ఓపెనర్‌గా ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్‌ను ఆడిస్తారా లేదా అతని బదులు రిషబ్ పంత్‌ను ప్రయోగిస్తారా అనేది ఆసక్తికరం.
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో అంబటి రాయుడు లేదా రిషబ్ పంత్‌ని ఆడిస్తారని మరో వాదన. ఇక ఐదో స్థానం కోసం దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, కేదర్ జాదవ్‌లలో మంచి పోటీ కనిపిస్తుంది.
ఏ స్థానంలో ఆడడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పిన ధోనీ ఆరో స్థానంలో, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏడులో బరిలోకి దిగనుండగా బౌలర్ల ఎంపిక సంక్లిష్టంగానే కనిపిస్తుంది. విశ్రాంతి తర్వాత బుమ్రాను జట్టులోకి తీసుకుంటారనేది పక్కా అయిపోగా ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్‌లకు మరో అవకాశం ఇవ్వనున్నారు. వారితో పాటు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌ని ఇద్దరినీ కొనసాగించాలా..? ఒకరిని మాత్రమే ఆడించి రవీంద్ర జడేజాకి అవకాశమివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు.