IPL 2019: ఆడింది చాలు.. తిరిగొచ్చేయండి

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019కు అన్ని దేశాలు దాదాపు జట్లు ప్రకటించేశాయి. ఈ ఎఫెక్ట్ ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 15న ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించడంతో ఐపీఎల్‌కు బై బై చెప్పేసి ఫ్లైట్ ఎక్కేశాడు స్టీవ్ స్మిత్.
ఏప్రిల్ 17న ఇంగ్లాండ్ తమ వరల్డ్ కప్ జట్టును ప్రకటించడంతో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్‌లు కూడా జట్టుకు దూరం కానున్నారు. వీళ్లు వరల్డ్ కప్ జట్టుతో పాటు పాకిస్తాన్ తో జరగనున్న వన్డే సిరీస్‌లో కూడా చోటు దక్కించుకోవడంతో వెళ్లక తప్పని పరిస్థితి.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఏప్రిల్ 26నాటికల్లా ఆటగాళ్లంతా ప్రాక్టీసుకు అందుబాటులో ఉండాలని పేర్కొంది. అసలే లీగ్ పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్.. విదేశీ ప్లేయర్లపైనే నమ్మకం పెట్టుకుని లాక్కొస్తుంది. ఈ సమయంలో వారు జట్టు నుంచి వెళ్లిపోవడం పెను సమస్యగా మారడం ఖాయం.
సన్‌రైజర్స్‌కు కష్టాలే:
సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా విదేశీ ప్లేయర్లతోనే లీగ్ నడిపిస్తోంది. వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో.. మరి కొద్ది రోజుల్లో ఇంగ్లాండ్ వెళ్లిపోవాలి. అతనితో పాటు డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా), మార్టిన్ గప్తిల్(న్యూజిలాండ్) తిరుగుప్రయాణం అవనున్నారు. టాప్ ఆర్డర్ లో ఉన్న కేన్ విలియమ్‌సన్, గఫ్తిల్ లేకపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంటి. ఇప్పటికే 7 మ్యాచ్‌లకు మూడింటిలో మాత్రమే విజయం సాధించి లీగ్ పట్టికలో చివరి నుంచి 3 స్థానంలో కొనసాగుతున్న రైజర్స్ ప్లేఆఫ్ కైనా చేరుకోగలదా..