ఐపీఎల్ లో 9 జట్లు!

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 07:59 AM IST
ఐపీఎల్ లో 9 జట్లు!

ipl-2021

Updated On : November 12, 2020 / 8:40 AM IST

IPL 2021 : ఐపీఎల్ వచ్చే సీజన్ లో 8 జట్లు కాకుండా..9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్ పై అప్పుడే కసరత్తును మొదలు పెట్టాయి. ఎందుకంటే..మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వీటిని నిర్వహించాల్సి ఉంటుంది. మరో నాలుగు నెలల్లో ఐపీఎల్ 14 జరగాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది టీ 20 ప్రపంచ కప్ కు భారత్ అతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..ఐపీఎల్ వాయిదా వేసే పరిస్థితులు కనిపించడం లేదు. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి వచ్చే సీజన్ పై కసరత్తును మొదలపెట్టాయి.




వేలం విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పాక్షిక వేలం కాకుండా..మెగా వేలాన్ని నిర్వహించాలనే దానిపై తర్జనభర్జనలు సాగుతున్నట్లు సమాచారం. ఆటగాళ్లందరినీ వేలానికి తేవడం వల్ల జట్ల రూపురేఖలు మారొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. రెండు నెలల్లో జరిగే వేలానికి సిద్ధంగా ఉండాలంటూ..బీసీసీఐ తమకు సమాచారం ఇచ్చిందని, అధికారికంగా తెలపకపోయినా..మరో జట్టు చేరే అవకాశం ఉన్నట్లు తెలిసిందని ఫ్రాంచైజీ ఉన్నతాధికారి వెల్లడించారు.




అహ్మాదాబాద్ ఫ్రాంచైజీ కొత్తగా రానుందని, బడా కార్పొరేట్ సంస్థలు దీనిపై కన్నేశాయని ప్రచారం జరుగుతోంది. ఆటగాళ్ల వేలం ఎలా ఉంటుందో, ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీ ఏ విధంగా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కానీ..కొన్నింటిపై బోర్డు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.