IPL 2025: చరిత్ర సృష్టించిన చాహల్.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు.. ఆ తరువాత ఏం చేశాడో చూశారా..! వీడియో వైరల్
యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ తో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతోపాటు ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Credit BCCI
IPL 2025 Yuzvendra Chahal: ఐపీఎల్ 2025 లో భాగంగా బుధవారం రాత్రి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో చెన్నై జట్టును ఓడించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమిలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కీలక భూమిక పోషించాడు. చివరిలో ఒకే ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లతోపాటు మొత్తం నాలుగు వికెట్లు తీసి సీఎస్కే భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా.. సామ్ కరన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. తొమ్మిది ఫోర్లు, ఆరు సిక్సులతో కేవలం 47 బంతుల్లో 88 పరుగులు చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించాడు. వీరిద్దరు మినహా చెన్నై జట్టులో ఎవరూ పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. చివరిలో యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ తో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో చెన్నై జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
Also Read: CSK vs PBKS : చెన్నై చిత్తు.. పంజాబ్ విక్టరీ.. ఫ్లేఆఫ్స్ రేసు నుంచి ధోనిసేన ఔట్..!
ఈ మ్యాచ్ లో తన బౌలింగ్ కోటాలో తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న చాహల్ కు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తిరిగి 19వ ఓవర్ వేసేందుకు అవకాశం ఇచ్చాడు. ఈ ఓవర్లో మొదటి బంతిని చాహల్ వైడ్ వేశాడు. ఆ తరువాత బంతిని మహేంద్రసింగ్ ధోనీ సిక్స్ కొట్టాడు. రెండో బంతినికూడా సిక్స్ కొట్టే ప్రయత్నంలో ధోనీ ఔట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన హుడా మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. ఆ తరువాత వరుసగా మూడు బంతుల్లో దీపక్ హుడా, కాంబోజ్, నూర్ అహ్మద్ లను ఔట్ చేయడం ద్వారా చాహల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా అరుదైన రికార్డును చాహల్ సొంతం చేసుకున్నాడు.
YUZI CHAHAL WITH HIS SIGNATURE POSE. 🔥 pic.twitter.com/wnfy3bJytL
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2025
ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ తరపున హ్యాట్రిక్ వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా చాహల్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు (9సార్లు) నాలుగు వికెట్ల హాల్ సాధించిన బౌలర్ గా చాహల్ నిలిచాడు. అయితే, హ్యాట్రిక్ వికెట్ల తరువాత చాహల్ గ్రౌండ్ లో పడుకొని తన ఆనందాన్ని తెలియజేశాడు. చాహల్ హ్యాట్రిక్ వికెట్లు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
🚨 IPL HATTRICK BY YUZI CHAHAL. 🚨
– One of the finest of this league. 👏 pic.twitter.com/X4zPBanVyp
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2025