KKR : గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతాకు బిగ్ షాక్.. కెప్టెన్ రహానేకు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే గాయపడ్డాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి కేకేఆర్ చేరుకుంది. ఈ గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కెప్టెన్ రహానేకు గాయపడ్డాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో అతడి చేతికి గాయమైంది. ఢిల్లీ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఎక్స్ ట్రాకవర్ మీదుగా షాట్ ఆడాడు. ఈ బంతిని ఆపేందుకు రహానే ప్రయత్నించాడు.
అయితే.. బంతి అతడి చేతి వేలిని తాకి వెళ్లిపోయింది. అతడి చేతికి బంతి తగలడంతో రక్తం వచ్చింది. నొప్పితో అతడు విలవిలలాడాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి నొప్పి ఎక్కువగా ఉండడంతో రహానే మైదానాన్ని వీడాడు. ఆ తరువాత స్టాండిన్ కెప్టెన్ గా సునీల్ నరైన్ వ్యవహించాడు. ఢిల్లీ పై ఒత్తిడి తెచ్చి కేకేఆర్‌కు విజయాన్ని అందించాడు.
గాయంపై స్పందించిన రహానే..
ఇక మ్యాచ్ అనంతరం తన గాయంపై రహానే స్పందించాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే.. టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం గాయం తీవ్రతను పరిశీలించిన తరువాతనే రహానే ను తదుపరి మ్యాచ్‌లో ఆడించాలా వద్దా అనేది నిర్ణయిస్తామని చెబుతున్నారు. ఒకవేళ రహానే గాయం తీవ్రమైనది అయితే అతడు తదుపరి మ్యాచ్‌ల్లో ఆడకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే.. అది కేకేఆర్ ప్లేఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపనుంది.
ఇక ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు సాధించింది. అంగ్క్రిష్ రఘువంశీ (44), రింకూ సింగ్ (36) లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు, చమీరా ఓ వికెట్ తీశారు.
అనంతరం డుప్లెసిస్ (62), అక్షర్ పటేల్ (43) లు ఆడినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా చెరో వికెట్ తీశారు.